Share News

అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:33 AM

తొలి వివాహబంధం విఫలమై, విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఏ మేరకు సిద్ధపడుతున్నారు? వారి ఆలోచనలు, ప్రాధాన్యాలు ఎలా ఉంటున్నాయి? అనే అంశంపై ప్రముఖ మ్యాచ్‌మేకింగ్‌ యాప్‌ రిబౌన్స్‌ ఓ సర్వే నిర్వహించింది

అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి

  • ప్రవర్తన నిలకడగా ఉండాలి, ఆసరాగా నిలవాలి

  • మానసిక ప్రశాంతత ముఖ్యం

  • భిన్నాభిప్రాయాలనూ వెల్లడించే స్వేచ్ఛ ఉండాలి

  • విడాకులు తీసుకున్న వారి మనోగతం

  • మ్యాచ్‌మేకింగ్‌ యాప్‌ ‘రిబౌన్స్‌’ సర్వేలో వెల్లడి

  • దేశంలో సాధారణమైపోయిన రెండో పెళ్లి

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తొలి వివాహబంధం విఫలమై, విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఏ మేరకు సిద్ధపడుతున్నారు? వారి ఆలోచనలు, ప్రాధాన్యాలు ఎలా ఉంటున్నాయి? అనే అంశంపై ప్రముఖ మ్యాచ్‌మేకింగ్‌ యాప్‌ రిబౌన్స్‌ ఓ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 9,475 మంది విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులు పాల్గొన్నారు. వీరంతా 28 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు. మెట్రోనగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది. వివాహం విఫలమైతే మళ్లీ పెళ్లి చేసుకోవడమనేది దేశంలో సాధారణమైపోయిందని ఈ సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక బంధం విజయవంతం కావటానికి భావోద్వేగ భద్రతనే కీలక అంశమని చెప్పారు. కొత్తగా ప్రేమలో పడేవారు, తొలిసారి పెళ్లి చేసుకునేవారు ఆకర్షణ (కెమిస్ట్రీ), రొమాన్స్‌, విలాసవంతమైన జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ, అప్పటికే ఒక బంధం తెగిపోయి విడాకులు తీసుకున్నవారు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారని సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతానికి పైగా వ్యక్తులు.. తమను అర్థం చేసుకుంటూ, సురక్షితమైన వాతావరణాన్ని అందించే భాగస్వామి దొరికితేనే రెండో వివాహానికి సిద్ధపడతామని తెలిపారు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయని వెల్లడైంది. మొదటి వివాహంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వీరు, రెండోబంధంలో కేవలం ఊహాజనిత ప్రేమ వెనుక పడటం లేదు. ఇంట్లో గొడవలు లేని పరిస్థితులను, మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారు. జీవిత భాగస్వామి ప్రవర్తనలో నిలకడగా, పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు.


ఒకటికి రెండుసార్లు ఆలోచించి..

తొలి బంధంలో విఫలమైన అనుభవం వల్ల జీవితంపై, అనుబంధాలపై వీరికి ఒక అవగాహన వస్తుంది. అందుకే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించే ముందు తొందరపడకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ఎదుటి వ్యక్తి తమకు సరిపోతారని అనుకున్నప్పుడే వీరు ముందడుగు వేస్తున్నారు. అంతేకాదు, ఏమైనా భేదాభిప్రాయం తలెత్తితే దానికి ఎలా స్పందిస్తారు అన్న అంశాన్ని కూడా వీరు అంచనా వేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది.. తమ భాగస్వామితో స్వేచ్ఛగా విభేదించగలిగే పరిస్థితి ఉండాలని, అప్పుడే ఆ ఆ బంధానికి దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందన్నారు.

మనసు మీద ఎలాంటి ప్రభావం పడింది?

30-40 ఏళ్ల మధ్య వయసున్న, విడాకులు తీసుకున్న పురుషులు, మహిళల్లో దాదాపు 43 శాతం మంది.. స్థిరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు తమకు నచ్చుతారని స్పష్టం చేశారు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకస్మికత, ఆకర్షణలతో కూడిన వ్యక్తులు నచ్చేవారని, జీవితంలో ఎదురైన అనుభవాలు తమకు స్థిరత్వం విలువను తెలియజేశాయని చెప్పారు. ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. విడాకులు తీసుకున్నవాళ్లు.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకొని సంబంధాలు చూస్తున్నప్పుడు, ఆయా వ్యక్తులతో కేవలం సంభాషణలకే ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆ సంభాషణ ముగిసిన తర్వాత తమకు ఎలా అనిపించిందో విశ్లేషిస్తున్నామని 37 శాతం మంది చెప్పారు. 29 శాతం మంది మహిళలు.. ‘నాకు ఈ వ్యక్తి నచ్చాడా?’ అని ప్రశ్నించుకోవడం కంటే, అతడితో సంభాషణ తర్వాత తమ మనసు తేలికగా అనిపించిందా, తాము తమలాగే స్వేచ్ఛగా ఉండగలిగామా, తమను గౌరవించాడా, తమ మాటలను శ్రద్ధగా విన్నాడా, లేక ఆ సంభాషణతో మానసికంగా అలసిపోయానా, మనసుపై ఒత్తిడి పెరిగిందా? వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారని సర్వే వెల్లడించింది.

Updated Date - Aug 28 , 2026 | 06:45 AM