కాలుష్యంపై కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి.. డిప్యూటీ సీఎం తక్షణ స్పందన
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:46 AM
‘మా గ్రామస్థులను కాలుష్యం బారి నుంచి కాపాడండి’ అంటూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు.
అమరావతి, ఆగస్టు 28: ‘మా గ్రామస్థులను కాలుష్యం బారి నుంచి కాపాడండి’ అంటూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి(PCB) అధికారులు తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో యంత్రాల ట్రయల్ రన్ సమయంలో కాలుష్య వాయువులు విడుదలవుతున్నట్లు గుర్తించారు. బాయిలర్‌లో కలప వ్యర్ధాలను ఇంధనంగా వినియోగిస్తున్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. ఎమర్జెన్సీ వెంట్ల ద్వారా R&R కాలనీ, కృష్ణంపాలెం వైపు కాలుష్య వాయువులు వ్యాప్తిస్తున్నట్లు తెలిపారు. బాయిలర్ చిమ్నీకి మల్టీ సైక్లోన్ డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
PCB నిబంధనల ప్రకారం తగిన ఎత్తులో చిమ్నీ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన ఉద్గారాలు విడుదల చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు పూర్తిగా ఏర్పాటు చేసే వరకు పరిశ్రమ కార్యకలాపాలకు తాత్కాలిక నిలుపుదల చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు పూర్తయ్యాకే కమిషనింగ్ ప్రక్రియ కొనసాగించాలని పీసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, చిమ్నీ ఏర్పాటు కోసం పరిశ్రమ యాజమాన్యం 20 రోజుల గడువు కోరింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన అనంతరం కమిషనింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు పీసీబీ అధికారులు అనుమతి ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్పు
ఎంతటివారితోనైనా అనైతిక పనులు చేయించగల మూర్ఖుడు జగన్: మంత్రి పార్థసారథి
Read Latest AP News And Telugu News