వేల మందితో పాదయాత్ర!
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:53 AM
సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అన్నట్లుగానే బుధవారం సిరిసిల్లలో అశేష జనవాహినితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. సిరిసిల్లలో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, స్వశక్తి మహిళలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
సిరిసిల్లలో అరగంటపాటు 3 కిలోమీటర్లు యాత్ర చేసిన సీఎం..
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగిన రేవంత్
సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ఆఫర్
సభలో బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై విసుర్లు
రూ.350.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
సిరిసిల్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అన్నట్లుగానే బుధవారం సిరిసిల్లలో అశేష జనవాహినితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. సిరిసిల్లలో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, స్వశక్తి మహిళలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 5 గంటల 16 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ నుంచి సీఎం సిరిసిల్లకు చేరుకున్నారు. 5.27 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభించి మూడు కిలోమీటర్ల దూరంలోని రగుడు చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి 6 గంటలకు చేరుకున్నారు. పాదయాత్రలో వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు సీఎంకు వినతి పత్రాలు అందించారు. సభాస్థలి వద్దే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
జిల్లా ఇందిర మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు. రూ.200 కోట్లతో సిరిసిల్లలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.99.40 కోట్లతో చేపట్టే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు, రూ.15.25 కోట్లతో నిర్మించే సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్ కార్యాలయ భవనాలకు, రూ.16.13 కోట్లతో కోనరావుపేట, సిరిసిల్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, రుద్రంగిలో రూ.10 కోట్లతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించే గోదాముల పనులకు శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సిరిసిల్లలో నూతన నేత బజార్ ఏర్పాటుతోపాటు రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై 50 నిమిషాలు ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై సెటైర్లు వేశారు.
సిరిసిల్లలో గెలిస్తే మంత్రి అయినట్టే..
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని సీఎం అన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రకటించారు. ఢిల్లీ హైకమాండ్‌ను ఒప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చెప్పటంతో సభికుల నుంచి హర్షం వ్యక్తమైంది. పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపిస్తామని సీఎం హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి గురించి అసెంబ్లీలో కొన్నే చెప్పానని, పార్ట్-2 ఇంకా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నేరెళ్ల గ్రామంలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకొని తీవ్ర హింసకు గురైన బాధితులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించారు. అభివృద్ధి లెక్కలు తెలుసుకోవడానికి శాసనసభకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసురుతూ.. ‘బడికి రాని బడి దొంగ’ అంటూ ఎద్దేవా చేశారు. మహిళల బోనాల నృత్యాలు, ఒగ్గుడోలు చప్పుళ్లు, టపాసుల మోతతో పాదయాత్ర, సభా ప్రాంగణం దద్దరిల్లాయి.
బీఆర్‌ఎస్, బీజేపీ నేతల అరెస్టుల పరంపర..
సిరిసిల్లలో సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తుండడం, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల భాగం కావటంతో సీఎం పాదయాత్ర, సభకు ఆటంకం కలిగిస్తారన్న అనుమానంతో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను బుధవారం తెల్లవారుజాము నుంచే అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సభ ముగిసిన అనంతరం వారిని వదిలిపెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వృద్ధ భారతం!
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్..
Read Latest AP News And Telangana News And International News And Telugu News