Share News

వృద్ధ భారతం!

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:34 AM

జపాన్‌, ఇటలీ, చైనా, దక్షిణ కొరియా మొదలైనవి వృద్ధాప్య దేశాలుగా మారకముందు సంపన్నదేశాలుగా ఆవిర్భవించాయి. కానీ, భారత్‌లో మాత్రం దీనికి భిన్నమైన ధోరణి కనిపిస్తోంది.

వృద్ధ భారతం!
Old Age People

వృద్ధ భారతం!

  • సంపన్న దేశం కాకముందే వృద్ధాప్యదేశంగా మారుతున్న భారత్‌

  • వచ్చే పదేళ్లలో జనాభాలో 15శాతం వృద్ధులు

  • మూడీస్‌ తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: జపాన్‌, ఇటలీ, చైనా, దక్షిణ కొరియా మొదలైనవి వృద్ధాప్య దేశాలుగా మారకముందు సంపన్నదేశాలుగా ఆవిర్భవించాయి. కానీ, భారత్‌లో మాత్రం దీనికి భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. మనమింకా మధ్యాదాయ దేశం నుంచి సంపన్న దేశంగా ఆవిర్భవించనే లేదు.. కానీ, వృద్ధాప్యం తరుముకొస్తోంది. దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో వృద్ధుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. రెండేళ్ల క్రితమే మన దేశం ‘వృద్ధాప్య దశ’లోకి అడుగుపెట్టగా, 2049 నాటికి వృద్ధదేశంగా, 2065 నాటికి అతి వృద్ధ దేశం (సూపర్‌ ఏజ్డ్‌)గా మారనుందని తాజాగా వెలువడిన మూడీస్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. 1950లో ఇది సగటున ఒక మహిళకు 4.9 మంది పిల్లలుగా ఉండగా, ప్రస్తుతం 2.2 మంది పిల్లలకు తగ్గింది. మానవాళి జనాభా స్థిరంగా ఉండాలంటే మహిళల సంతానోత్పత్తి రేటు కనీసం 2.1 ఉండాలి. దీనినే జనాభా భర్తీ రేటు అంటారు. దీనికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది.. తగ్గితే జనాభా తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 70శాతానికిపైగా భర్తీరేటుకు సమీపంలో లేదా దానికి దిగువన ఉన్న దేశాల్లో నివసిస్తోంది. దీంట్లో భారత్‌ కూడా ఉంది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉంది. సాపేక్షికంగా అధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతున్న యూపీ, బిహార్‌లను మినహాయిస్తే ఇది మరీ 1.6కు పడిపోతోంది.


2036 నాటికి 23 కోట్ల మంది వృద్ధులు

దేశంలో ఏటా నమోదవుతున్న జననాలు 2.32 కోట్లు మాత్రమే. 60 ఏళ్లు ఆపై వయసున్న వారి సంఖ్య 2011లో 10 కోట్లు కాగా, 2036 నాటికి అది 23 కోట్లకు పెరగనుందన్న అంచనాలున్నాయి. మొత్తం జనాభాలో వారి వాటా 15శాతం ఉండనుంది. ‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌’ నివేదిక ప్రకారం.. భారత్‌లో వృద్ధుల జనాభా 2046 నాటికి 0-15 ఏళ్ల వయసున్న పిల్లల కంటే ఎక్కువగా ఉంటుంది. దేశం క్రమేణా వృద్ధాప్యం దిశగా ప్రయాణిస్తోందనటానికి ఇవన్నీ సూచికలు. దీనిద్వారా సంభవించే సమస్యలు రెండు.. పని చేయటానికి అవసరమైన కార్మికులు, శ్రామికుల సంఖ్య తగ్గుతుంది. మరోవైపు, జనాభా తగ్గటం వల్ల మార్కెట్‌లో సరుకులకు డిమాండ్‌ తగ్గుతుంది. అంతేకాదు, పింఛన్లు, ఆరోగ్యరంగంపై వ్యయం వంటివి పెరుగుతాయి. పెరిగే వృద్ధుల్లో దాదాపు 40ు మంది పేదవర్గంలో ఉండేవారేనని అంచనాలున్నాయి. తద్వారా వారి పోషణ, గృహవసతి వంటివి కూడా ప్రభుత్వానికి కీలక అంశాలవుతాయి. మధ్యాదాయదేశంగా ఉన్న భారత్‌కు ఇది ఆర్థికంగా మరింత భారంగా మారుతుందని మూడీస్‌ నివేదిక అభిప్రాయపడింది. దీనికి పరిష్కారం.. మహిళల సంతానోత్పత్తి రేటును పెంచటం. ఈ దిశగా దేశంలో అక్కడక్కడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదన్న నిబంధనను తొలగించారు. 3వ, 4వ పిల్లలను కనే జంటలకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించారు.


ప్రోత్సాహకాలతో పెరగని జననాలు

ఈ రకమైన చర్యలు సంతానోత్పత్తి రేటును పెంచుతున్న దాఖలాలు లేవని ప్రముఖ వైద్య జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. నగదు బదిలీలు, పన్ను రాయితీలు, పిల్లల పెంపకానికి అవసరమైన సదుపాయాల కల్పన వంటివి సంతానోత్పత్తి రేటును పెంచలేకపోయాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. అందుకే వృద్ధులు గణనీయమైన సంఖ్యలో ఉండే సమాజానికి తగినట్లుగా చర్యలు తీసుకోవటమే మేలని ఆరోగ్యరంగ నిపుణులు కూడా సూచిస్తున్నారు. వీరి ప్రకారం.. కార్మికశక్తి లోటును భర్తీ చేసుకోవటానికి మహిళల్ని పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి రంగాల్లోకి తీసుకురావాలి. ప్రస్తుతం భారత్‌లో కార్మికశక్తిలో మహిళల వాటా 32 శాతమే. మూడీస్‌ నివేదిక సరిపోల్చిన 19 ఆర్థిక వ్యవస్థల్లో ఇదే కనిష్ఠం. తద్వారా వినియోగించుకోని మహిళా శక్తి భారత్‌లో పుష్కలంగా ఉందని స్పష్టమవుతోంది. సురక్షితమైన రవాణా, పని పరిస్థితులు, పిల్లల పెంపకం వంటి అంశాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మహిళల్ని పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ రంగాల్లోకి తీసుకురావచ్చు. దీంతోపాటు మెరుగైన ఆరోగ్య ప్రమాణాల నేపథ్యంలో.. ఉద్యోగాలు చేస్తున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో 60 ఏళ్ల వయసు దాటిన పురుషుల్లో 51శాతం మంది, మహిళల్లో 22శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది.

ఇంకా మనది యువ దేశమే

భారత్‌లో వృద్ధుల సంఖ్య పెరగటం సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామమేగానీ ఇప్పటికిప్పుడు ఇది సమస్య కాబోదని మూడీస్‌ నివేదిక తెలిపింది. ఇప్పటికీ యువత అధికంగా ఉన్న యువదేశంగానే భారత్‌ కొనసాగుతోందని, అయితే, ఈ అవకాశం క్రమేణా కుంచించుకుపోతోందని తెలిపింది. వచ్చే 15-20 ఏళ్లలో భారత్‌ ఏం చేస్తుందనేదానిబట్టి.. వృద్ధాప్యం దేశానికి భారంగా పరిణమిస్తుందా లేక కొత్త వ్యాపార అవకాశాలను తీసుకొస్తుందా అన్నది తెలుస్తుందని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ.

Updated Date - Oct 01 , 2026 | 03:35 AM