రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:39 PM
డబ్బుల కోసం రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరమైన చర్య అని, దీనికి దూరంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 30: రష్యా సాయుధ దళాల్లో భారతీయులను నియమిస్తున్నారని నివేదికలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈరోజు (బుధవారం) పలు కీలక సూచనలు చేసింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే భారతీయులు.. ధృవీకరించని వ్యక్తులు, ఏజెంట్ల ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులు కావొద్దని సూచించింది. రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరమైన చర్య అని, దీనికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. కొందరు భారత పౌరసత్వాన్ని కూడా వదులుకుని, రష్యా సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది.
రష్యా సైన్యంలో చేరితే భారీగా డబ్బు లభిస్తుందని, తర్వాత భారత ప్రభుత్వం ద్వారా విడుదల చేయించుకోవచ్చని భావించి స్వచ్ఛందంగా చేరుతున్న ఘటనలు కూడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విదేశీ పౌరులను రష్యా సాయుధ దళాల్లో చేర్చేందుకు ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద గ్రూపులు కూడా ప్రయత్నిస్తున్నాయని వివరించింది. విదేశీ ఉద్యోగ ఆఫర్లు ఇచ్చే ఏజెంట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్(Ministry of External Affairs)లో నమోదై ఉన్నారా.. లేదా అని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
ఈ వార్తలూ చదవండి
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ..
‘యూపీలో అన్ని దర్యాప్తులు సీబీఐకే అప్పగించాలా?’