‘యూపీలో అన్ని దర్యాప్తులు సీబీఐకే అప్పగించాలా?’
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:26 PM
యూపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పద్ధితిని అనుసరిస్తే.. ఇకపై ఆ రాష్ట్రంలో జరిగే అన్ని దర్యాప్తులను సీబీఐకి అప్పగించడమే మంచిదని వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు దర్యాప్తు నిర్వహించిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు ఇదే పద్ధితిని అనుసరిస్తే.. ఇకపై యూపీలో జరిగే అన్ని దర్యాప్తులను సీబీఐకి అప్పగించడమే మంచిదని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానించింది. 'ప్రతి విషయంలోనూ మీకొక స్వార్థపూరిత ఉద్దేశం ఉంటుంది. మీరు కేసులను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఇలా ఉంటే.. ఇకపై దర్యాప్తులన్నింటినీ సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది' అని పేర్కొంది.
ఫిర్యాదుదారుడు.. నిందితుణ్ని సంఘటనా స్థలంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నప్పటికీ.. పోలీసులు మాత్రం అతణ్ని అపరిచిత వ్యక్తిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అతణ్ని స్పాట్‌లోనే పట్టుకున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తిగా ఎందుకు నమోదు చేశారు? సంఘటనా స్థలంలోనే పట్టుబడినా.. తెలియని బైక్ అని ఎఫ్‌ఐఆర్‌లో రాయడమేంటి?' అని ధర్మాసనం నిలదీసింది. కాగా.. పోలీసులు మొదట్నుంచీ ఈ దర్యాప్తును ఏకపక్షంగా నిర్వహించారని పిటిషనర్ ఆరోపించారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు నిందితుడి పేరును ఛార్జిషీట్‌లో చేర్చినప్పటికీ.. ఆ తర్వాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చారని వివరించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు దానికి నంబర్ ప్లేట్ లేదని, అయితే దర్యాప్తు సమయంలో దానికి రిజిస్ట్రేషన్ నంబర్‌ను జోడించారని కూడా పేర్కొన్నారు.
దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. పోలీసుల పనితీరుపై తీవ్రంగా మండిపడింది. 'నియమాలను పాటించడం ఒక విషయమైతే, అన్ని హద్దులు దాటడం పూర్తిగా వేరే విషయం.. ఆపై కప్పిపుచ్చడం ఇంకో విషయం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్పాట్‌లోనే పట్టుబడినా.. నిందితుడి పేరును ఎందుకు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు? అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే పేరు మార్చవచ్చని, లేదంటే ఇంకొకరి పేరును చేర్చేందుకే ఇలా చేశారా? అక్కడ వ్యవహారమంతా ఇలాగే కొనసాగుతోందా?' అని ప్రశ్నించింది. యూపీ పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కూడా పూర్తిగా నిరాశపరిచిందని అభివర్ణించింది. తదుపరి విచారణకు సంబంధిత పోలీస్ అధికారి వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ధర్మాసనం.. ఈ సారి పూర్తిస్థాయి అఫిడవిట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. ఈ ఎఫ్‌ఐఆర్‌పై స్పష్టమైన వివరణ ఇవ్వాలనీ పేర్కొంది.
ఇవీ చదవండి:
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు
ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు!