Share News

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌..

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:37 AM

: సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. జన సందోహం మధ్య దండయాత్రగానే సీఎం పాదయాత్ర, బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి మహిళ బోనాల నృత్యాలు, ఒగ్గుడోలు చప్పుళ్లు, టపాసుల మోతతో పాదయాత్ర, సభా ప్రాంగణం

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌..

సిరిసిల్ల, సెప్టెంబరు 30 (ఆంరఽధజ్యోతి): సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. జన సందోహం మధ్య దండయాత్రగానే సీఎం పాదయాత్ర, బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి మహిళ బోనాల నృత్యాలు, ఒగ్గుడోలు చప్పుళ్లు, టపాసుల మోతతో పాదయాత్ర, సభా ప్రాంగణం దద్దరిల్లింది. బుధవారం సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సీఎంకు కాంగ్రెస్‌ శ్రేణులు, స్వశక్తి మహిళలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల సీఎం పర్యటన విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ జోష్‌లో నింపింది. సిరిసిల్ల సభ ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం కావడం, సభా వేదికపై ముఖ్యమంత్రితోపాటు మంత్రులు భారీ జనసందోహంతో, కాంగ్రెస్‌ శ్రేణులను ప్రశంసించడంతో క్యాడర్లో ఉత్సాహం పెరిగింది. సాయంత్రం 5 గంటల 16 నిమిషాలకు హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల చేరుకున్నారు. 5.27 గంటలకు అంబేద్కర్‌ చౌరస్తా నుంచి పాదయాత్ర మూడు కిలోమీటర్ల మేర రగుడు చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలం వరకు 6 గంటల కొనసాగింది. పాదయాత్రలో వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు అందించారు. 6.15 నిమిషాలకు సభ స్థలానికి చేరుకుని రూ.350.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జిల్లా ఇందిర మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో రూ.200 కోట్లతో సిరిసిల్లలో ఏర్పాటుచేసే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణం, రూ.99.40 కోట్లతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణకు సంబంధించిన పనులకు, రూ.15.25 కోట్లతో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలకు, రూ.16.13 కోనరావుపేట, సిరిసిల్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, రుద్రంగిలో రూ.10 కోట్లతో 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపన, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, సిరిసిల్లలో నూతన నేత బజార్‌ ఏర్పాటుతోపాటు రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు.

ఫ సిరిసిల్ల నుంచి గెలిస్తే మంత్రి పదవి..

అనంతరం సభా వేదికపై ముఖ్యమంత్రి 50 నిమిషాలు ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడమేకాకుండా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులను ఉద్దేశించి సవాల్‌ విసిరారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వివిధ పథకాల లెక్కలను వివరిస్తూ జనం నుంచే సమాధానాలు రాబట్టారు. వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని చెప్పడమే కాకుండా సిరిసిల్లలో కాంగ్రెస్‌ జెండా ఎగుర వేయాలని అన్నారు. 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి వచ్చిన వారికి మంత్రి పదవి ఖాయమని ఢిల్లీ హైకమాండ్‌ను ఓప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం అయింది. పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపిస్తామని అన్నారు. సభలో సిరిసిల్ల ను ఉరిసిల్లగా మార్చిన గత ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఆడపడుచులకు అందించిన బతుకమ్మ సారెలోను కమిషన్లు తీసుకున్నారని, చీరలు కూడా పొలాలకు పిట్టలను బెదరగొట్టడానికి కట్టారని తమ ప్రభుత్వం నాణ్యమైన చీరలు అందిస్తే వాటిని కట్టుకొని తమ అక్కలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ పండుగకు చిలకపచ్చ చీరలు అందిస్తాం అన్నారు. మరోవైపు గత ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత, సంతోష్‌ రావు ల లకు లక్షల కోట్లు సంపద ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టులో ముంపు బాధితులుగా జోగినిపల్లి రవీందర్‌రావు సంతోష్‌ రావు సౌమ్యరావులు పరిహారం పొందిన విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్‌కు లేదని చెప్తున్నా కేటీఆర్‌ కు ఫాంహౌస్‌ లు, స్టార్‌ హోటల్లు ఎలా వచ్చాయని అన్నారు. అసెంబ్లీలో కొన్నే చెప్పానని పార్ట్‌-2 ఉందని అన్నారు.

ఫ నేరెళ్ల బాధితుల ప్రసావన..

నేరెళ్ల బాధితుల బాధలను ప్రస్తావించారు. ఇసుక దోపిడీలో లారీల కింద తొక్కించారని అన్నారు. నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం తరఫున రూ 5లక్షల నుంచి రూ 10 లక్షల వరకు పరిహారం అందించారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమంతో పాటు, వేములవాడ, భద్రాద్రి అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేస్తూ తాము నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులను ప్రధాన టార్గెట్‌గా మాట్లాడడం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అభివృద్ధి లెక్కలు తెలుసుకోవడానికి శాసనసభకు రావాలని కేసీఆర్‌కు సవాల్‌ విసురుతూ బడికి రాని బడి దొంగ అంటూ ఎద్దేవా చేశారు. సభా వేదికపై మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌, పొన్నం ప్రభాకర్‌, అట్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ సలహాదారుడు హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మదన్‌ మోహన్‌రావు, బల్మూరి వెంకట్‌, మక్కాన్‌సింగ్‌, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:37 AM