పచ్చళ్ల తయారీకి ధరల ఘాటు..
ABN , Publish Date - May 09 , 2026 | 01:45 PM
పచ్చడి తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడంతో పేదలకు పచ్చడి మెతుకులు సైతం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
జగిత్యాల: పచ్చడి తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడంతో పేదలకు పచ్చడి మెతుకులు సైతం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మామిడికాయ పచ్చడిని మే, జూన్ నెలల్లో ప్రతీ ఇంట్లో తయారు చేసుకుంటుంటారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు కారం పొడి, నూనె, వెల్లుల్లి, జిలకర, ఆవాలు, మెంతులు ఇలా పచ్చడి తయారీకి అవసరమ్యే అన్ని సరుకుల ధరలు పెరిగాయి. దీంతో ఆవకాయ పచ్చడి పెట్టుకోవడాన్ని కొందరు పేద ప్రజలు వదులుకుంటున్నారు.
పెరిగిన పచ్చడి తయారీ పదార్థాల ధరలు...
యేటా వేసవిలో పచ్చడి మామిడి కాయలు కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధరలు పలికేవి. ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు పలుకుతున్నాయి. దీనికి తోడు పచ్చడి తయారీకి అవసరమయ్యే వేరుశనగ నూనె, ఎండు మిర్చికారం, మసాల దినుసులు, వెల్లుల్లి ధరలు పెరిగాయి. ఆవాలు గత యేడాది రూ.120 ఉండగా ప్రస్తుతం రూ. 130 ఉంది. వేరు శనగ నూనె కిలో గత యేడాది రూ.250 ఉండగా ప్రస్తుతం రూ. 300 బ్రాండ్‌ను బట్టి పెరిగింది. వెల్లుల్లి సైతం కిలో ధర ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్య తను బట్టి రూ.260 నుంచి రూ.320 వరకు ఉంది.
ఎండు మిరప కాయలు గత యేడాది రూ.250 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుత యేడాది రూ.500 నుంచి రూ.600 వరకు పెరిగింది. కారం పొడి అయితే కిలో రూ.500 వరకు పలుకుతోంది. పచ్చడి మామిడి కాయలను ముక్కలను చేసేందుకు కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు డిమాండ్‌ను బట్టి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం లెక్కల ప్రకారం రెండున్నర కిలోల పచ్చడి తయారీకి రూ.400 నుంచి రూ.500 వరకు వ్యయం అవుతోంది. యేటా ఖర్చులు పెరుగుతుండడంతో మామిడి పచ్చడి తయారు చేసుకు నేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఆసక్తి ని చూపడం లేదు. కాగా కొన్ని కుటుంబాలు గతంలో తయారు చేసుకునే పచ్చడి పరిణామంలో సగం వరకు మాత్రమే తయారు చేసుకుంటున్నారు.
ధరలు బాగా పెరిగాయి
పుప్పాల గంగలక్ష్మి, మెట్‌పల్లి, జగిత్యాల
ఈ యేడాది పచ్చడి మామిడి పచ్చడి తయారీ వస్తువుల ధరలు పెరిగాయి. గత యేడాది కంటే ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యా యి. వేరుసనగ నూనె, మామిడి కాయలు, కారం పొడి, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు ఇలా పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులకు పచ్చడి తయారీ భారంగా మారింది.
ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు
అడిగొప్పుల రజిని, మెట్‌పల్లి, జగిత్యాల
మద్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు సైతం పిరమవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల ప్రస్తుత సీజన్‌లో ఆవకాయ పచ్చడి తయారీ చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పెరుగుతున్న ధరల కారణంగా ఆర్థిక ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది. కొందరు పచ్చడి తయారీ చేసుకోవడంపై ఆశలు వదులుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News