జమ్మికుంట బల్దియాలో మరో వివాదం..
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:37 PM
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పాలనలో వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కౌన్సిలర్ ఆడియో వైరల్
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మద్దతుగా పారిశుధ్య కార్మికుల నిరసన
జమ్మికుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పాలనలో వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో అవినీతి, అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరగగా, తాజాగా డీజిల్ టోకెన్ల వ్యవహారం, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై కౌన్సిలర్ల ఆరోపణలు, ఓ కౌన్సిలర్ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియోతో కొత్త వివాదం ప్రారంభమైంది.
మున్సిపాల్టీలో సానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఇల్లందుల రమేష్‌కు ఓ కౌన్సిలర్ ఫోన్ చేసి డీజిల్ టోకెన్ ఇవ్వాలని కోరినట్లు, అందుకు తన వద్ద టోకెన్లు లేవని, డీజిల్ టోకెన్ల వ్యవహారాన్ని కమిషనర్ పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని రమేష్ సమాధానం ఇచ్చినట్లు చెబుతున్న ఆడియో వైరల్‌గా మారింది. ఈ సంభాషణలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ పట్ల అవహేళనగా మాట్లాడినట్లు పారిశుధ్య కార్మికులు ఆరోపించారు. ఆడియోలోని మాటలు, సందర్భం, పూర్తి వాస్తవాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
సానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై ఆరోపణలు, కౌన్సిలర్ ఆడియో వ్యవహారాన్ని నిరసిస్తూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారిని అవమానించేలా మాట్లాడటం సరికా దని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధుల్లో జోక్యం చేసుకోకుండా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఆందజేశారు. గతంలో అవినీతి, అక్రమాలపై రూ.32లక్షల రికవరీ నోటీసుల వ్యవహారం పూర్తిగా సద్దుమనుగకముందే మరో వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం
Read Latest AP News And Telangana News And International News And Telugu News