Share News

రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న గాజియాబాద్‌ వ్యాపారులు..

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:22 AM

కేంద్ర ప్రభుత్వం, వ్యాపారుల మధ్య మర్చంట్ డిస్కౌంట్ రేట్ వ్యవహారం ముదురుతోంది. అక్టోబర్ 15 నుంచి అమలయ్యే 0.4 శాతం ఎండీఆర్‌ని గాజియాబాద్‌ వ్యాపారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు మించిన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని దుకాణాల ఎదుట నోటీసులు అంటించారు.

రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న గాజియాబాద్‌ వ్యాపారులు..
UPI MDR Issue

ఉత్తర్‌ప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం, వ్యాపారుల మధ్య మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వ్యవహారం ముదురుతోంది. అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలు దాటిన కొన్ని యూపీఐ చెల్లింపుల(P2M)పై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, దీనిని వ్యాపార వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఈ మేరకు గాజియాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు మించిన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని కొంత మంది వ్యాపారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటీసులను తమ దుకాణాల ఎదుట అంటించారు. రూ.2 వేలకు పైబడిన కొనుగోళ్లకు వినియోగదారులు నగదు తీసుకురావాలని వారు సూచించారు. దీంతో ఘాజియాబాద్‌లో ఈ నోటీసుల వ్యవహారం చర్చనీయాంశమైంది.


కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రూ.2 వేలు దాటిన కొన్ని వ్యాపార యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు. ఈ నిబంధనను కేంద్రం అక్టోబర్ 15 నుంచి అమలు చేయనుంది. ఈ ఛార్జీని వినియోగదారులు కాకుండా వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వ్యాపార వర్గాలు భగ్గుమన్నాయి. ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతే, చివరికి కస్టమర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం పీ2ఎం యూపీఐ లావాదేవీల్లో ఎక్కువ భాగం చిన్న మొత్తాలవే. ఆగస్టులో 86 శాతం లావాదేవీలు రూ.500 లోపు ఉండగా, మరో 10 శాతం రూ.501 నుంచి రూ.2 వేల మధ్య నమోదయ్యాయి.


కేంద్రం ప్రకారం రూ.75 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ లెక్కించినప్పటికీ గరిష్ఠంగా రూ.300 మాత్రమే పడుతోంది. దీంతో వ్యాపారులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర వర్గాలు అంటున్నాయి. కాగా, కేంద్రం నూతన నిబంధనల ప్రకారం సాధారణ ప్రజలు ఒకరి నుంచి మరొకరికి చేసే యూపీఐ చెల్లింపులు ఈ పరిధిలోకి రావు.


ఈ వార్తలు కూడా చదవండి

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. నిరసనకు దిగిన తోటి విద్యార్థులు..

భర్తతో తరచూ గొడవలు.. ప్రియుడితో కలిసి హత్య..

Updated Date - Sep 19 , 2026 | 11:58 AM