Share News

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:48 AM

ఈ యేడాది జూన్‌ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యంగా ప్రవేశించడం, జూన్‌ చివరి వారం వరకు వానలు పడకపోవడంతో లోటు వర్షపాత నమోదైంది.

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం
Rainfall deficit, Jagityal

  • జిల్లాపై ఎల్‌నినో ప్రభావం

  • చెరువులు, ప్రాజెక్టుల్లోకి చేరని నీరు

  • వానల కోసం రోజూ ఎదురుచూపే...

జగిత్యాల: ఈ యేడాది జూన్‌ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యం గా ప్రవేశించడం, జూన్‌ చివరి వారం వరకు వానలు పడక పోవడంతో లోటు వర్షపాత నమోదైంది. జూన్‌లో జిల్లా సగటు సాధారణ వర్షపాతం 153.4 మిల్లీమీటర్లు కాగా ఈ యేడాది జూన్‌లో కేవలం 110.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం కంటే 28 మిల్లీమీటర్ల లోటు నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.


మృగశిర కార్తెలో చిరు జల్లులే..

వానాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో జిల్లా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వర్షపాతం లోటుగా ఉండడంతో పాటు మండలాల మధ్య అసమాన వర్షపాతం రైతులకు ఇబ్బందిగా మారింది. మృగ శిర కార్తెలో అక్కడక్కడా కురిసిన చిరు జల్లులు సాగుకు అనువుగా పొలాలను తడవలేక పోయాయి. భూమిలో తేమ నిలిచేంతగా వర్షం లేకపోవడంతో సాగు పనులు ముందుకు కదలడం లేదు. దుక్కి పనులు పూర్తిగాక విత్తనాలు ఇంట్లోనే ఉండిపోవడంతో రైతుల ఆశలన్నీ ఇప్పుడు ఆరుద్ర కార్తెపై నిలిచాయి. వాన కోసం రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తూ రోజులు లెక్కిస్తున్నారు.


నిరాశలో రైతులు

వ్యవసాయంలో మృగశిర, ఆరుద్రకార్తెలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాధారంగా మృగ శిరలో జూన్‌ 7వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు కురిసే వర్షాలతో వానాకాలం సాగు పనులు ఊపందుకుంటాయి. అయితే ఈసారి పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. అందుకే రైతులు ఇప్పుడు ఆరుద్ర కార్తెలోనైనా విస్తారంగా వర్షాలు కురవాలని ఆశిస్తున్నారు. ఆరుద్రలో జూన్‌ 22వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మంచి వర్షాలు కురిస్తే వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, కంది, జొన్న, నువ్వు తదితర పంటల సాగు వేగం పుంజుకుంటుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


అధిక మండలాల్లో లోటు

మండ లాల వారీగా చూస్తే తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. జిల్లా సగటు వర్షపాతం 110.3 మిల్లీమీటర్లు నమోదైంది. ఎండపల్లి, మేడి పల్లి, ధర్మపురి, మల్లాపూర్‌ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురవగా మిగితా మండలాల్లో లోటు వర్షపాతం నమోదవుతుండడంతో వానాకాలం సాగుపై ప్రభావం పడుతోంది.


rain.jpgఇప్పటి వరకు 4,550 ఎకరాలే సాగు

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 4,550 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న, పసుపు పంటలు సాగు అవుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3,35,978 ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4,25,950 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇది సాధారణం కన్నా 89,972 ఎకరాలు అధికంగా ఉంది. ప్రధానంగా వరి 3,16,000 ఎకరాలు, మొక్కజొన్న 35,000 ఎకరాలు, కందులు 1,500, పెసర్లు 100, సోయా చిక్కుడు 800, పత్తి 19,000, చెరుకు 350 ఎకరాలు, పసుపు 9,500, మిరప 550 ఎకరాలు, పలు కూరగాయల పంటలు 350 ఎకరాలు, ఆయిల్‌ ఫాం 5,000 ఎకరాలు, మామిడి 37,000 ఎకరాలు, ఇతర పంటలు 450 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు పంటల సాగు ఊపందుకోలేదు.


బీళ్లుగానే పొలాలు..

వరి సాగుకు ముందు రైతులు పచ్చిరొట్ట, జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి సేంద్రియ ఎరువులు ఒక అడుగు ఎత్తు వరకు పెరిగేవి. ఈసారి దుక్కులు కూడా దున్నకుండా వాన కోసం చూస్తున్నారు. దీంతో పొలాలన్నీ బీళ్లుగానే కనిపిస్తున్నాయి. ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి నేలలో నీరు నిలిచి 70 నుంచి 80 శాతం తేమ ఉంటేనే విత్తనాలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ భారీ వర్షం కురవక పోతుందా అనే ఆశతో పదును లేకున్నా కొన్ని చోట్ల రైతులు విత్తనాలు వేస్తున్నారు.


జగిత్యాల జిల్లా: జూన్‌లో నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లలో)

మండలం

సాధారణ వర్షపాతం

నమోదైన వర్షపాతం

స్థితి

ఇబ్రహీంపట్నం

159.4

69.4

57% లోటు

మల్లాపూర్

138.3

124.3

సాధారణం

రాయికల్

149.0

117.4

21% లోటు

బీర్‌పూర్

183.1

83.1

55% లోటు

సారంగాపూర్

153.7

76.9

50% లోటు

ధర్మపురి

46.4

139.1

సాధారణం

బుగ్గారం

149.4

115.6

23% లోటు

జగిత్యాల రూరల్

170.3

104.4

39% లోటు

జగిత్యాల

172.6

118.0

32% లోటు

మేడిపల్లి

138.7

149.4

సాధారణం

కోరుట్ల

146.1

95.9

14% లోటు

మెట్‌పల్లి

166.7

131.8

21% లోటు

కథలాపూర్

165.2

105.8

36% లోటు

కొడిమ్యాల

131.8

54.9

58% లోటు

మల్యాల

144.7

122.7

15% లోటు

పెగడపల్లి

149.8

48.1

68% లోటు

గొల్లపల్లి

157.8

84.8

46% లోటు

వెల్గటూరు

153.3

53.6

65% లోటు

ఎండపల్లి

152.3

152.9

సాధారణం

బీమారం

137.6

62.4

55% లోటు

జిల్లా మొత్తం

153.4

110.3

28% లోటు


భారీ వర్షాలు కురవాలి..

  • కుంట భాస్కర్‌రెడ్డి, యువ రైతు, తిమ్మాపూర్‌

వర్షాలు ఆలస్యం కావడంతో కొంతమేర దిగుబడి తగ్గుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలస్యం అయినా ముందు రోజుల్లో సరిపడా కాలానుగుణంగా వర్షం పడితే నష్టం ఉండదు. లేనట్లయితే రైతులకు దిగుబడి, చీడపీడల బాధతప్పదు. వానలకోసం ఎదురుచూస్తున్నాము.


ఈ వార్తలు కూడా చదవండి:

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

ట్రాఫిక్‌ గాలికొదిలేసి..సెల్‌ఫోన్‌ చూస్తూ..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 12:04 PM