వయ్యారాల కారిడార్.. జీవీకే1 నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు..
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:08 AM
హైదరాబాద్ మహానగరంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ గల బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ రానుంది.
మూడు కిలోమీటర్లతో హెచ్‌ఎండీఏ ప్రతిపాదన
మాసబ్‌ట్యాంక్ వద్ద అండర్‌పాస్ నిర్మాణం
కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సాగుతున్న సర్వేలు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహానగరంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ గల బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ రానుంది. జీవీకే వన్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానంగా నిర్మాణం చేపట్టనున్నారు. వంపులు, మెలికలు కలిగిన ఈ మార్గంలో వయ్యారాల ఎలివేటెడ్ కారిడార్‌ను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఓ కన్సల్టెన్సీ ద్వారా డిజైన్ చేస్తున్నారు. మూడు కిలోమీటర్లకు పైగా ఉండే కారిడార్‌కు మూడు ప్రాంతాల్లో అప్ ర్యాంప్‌లు రానున్నాయి. మరో రెండు ప్రాంతాల్లో డౌన్ ర్యాంపులు వచ్చేలా డిజైన్ చేశారు. దాంతో పాటు మాసబ్‌ట్యాంక్ జంక్షన్‌లో ఫ్ల్లైఓవర్ ఏర్పాటు చేసినా ట్రాఫిక్ రద్దీ తగ్గని నేపథ్యంలో ఓ అండర్‌పాస్ నాలుగు లేన్లతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కన్సల్టెన్సీ ద్వారా బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సర్వేతో పాటు భౌగోళిక సర్వేలను చేపడుతున్నారు.
కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు
నగరవాసులు సులువుగా శంషాబాద్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరేందుకు వైఎస్ హయాంలో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను 11 కిలోమీటర్ల మేర నిర్మించారు. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్ వేకు చేరుకోవడం నగరవాసులకు అతికష్టంగా మారింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన వాహనదారులకు మూడు, నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రద్దీ వేళలో గంట వరకు సమయం పడుతోంది. సాధారణ సమయంలో కూడా కనీసం అరగంట పడుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 మార్గంలో జీవీకే వన్ నుంచి మొదలు.. తాజ్‌కృష్ణా హోటల్, కేర్ ఆస్పత్రి, పెన్షన్ ఆఫీసు, మాసబ్‌ట్యాంక్ వరకు విపరీతమైన రద్దీ ఉంటోంది. ఎన్‌ఎండీసీ ప్రాంతం నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతుంటాయి. వర్షం వస్తే వాహనాలు కదలవు. మాసబ్‌ట్యాంక్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌పైన, కింది మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. దీంతో ఈ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
వయ్యారాలు ఉండేలా..
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని జీవీకే వన్ నుంచి ఎలివేటెడ్ కారిడార్‌ను నాలుగు లేన్లతో మెహిదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి వరకు గల పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానం చేయనున్నారు. జీవీకే వన్ నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు ఈ మార్గమంతా దాదాపు పది మలుపులతో ఉండగా, వయ్యారాలతో ఎలివేటెడ్ కారిడార్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇందులో ఐదు ర్యాంపులు రానుండగా అన్నీ రెండు లేన్లతో డిజైన్ చేస్తున్నారు. తాజ్‌డెక్కన్ వైపు నుంచి, మాసబ్‌ట్యాంకు నుంచి, మెహిదీపట్నం వద్ద అప్ ర్యాంప్‌ను నిర్మించనున్నారు. ఆసి్‌ఫనగర్ రోడ్డు, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద డౌన్ ర్యాంపులు నిర్మించనున్నారు. కారిడార్ నిర్మాణంతో జీవీకే వన్ నుంచి మాసబ్‌ట్యాంకు, ఎన్‌ఎండీసీ, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదుగా ఆరాంఘర్ వరకు సులువుగా ప్రయాణం చేయవచ్చు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.
మాసబ్‌ట్యాంక్ వద్ద అండర్‌పాస్‌కు ప్లాన్
మాసబ్‌ట్యాంక్ వద్ద బంజారాహిల్స్ నుంచి విజయ్‌నగర్ కాలనీ వైపు వెళ్లే వాహనదారులకు నాలుగు లేన్లతో అండర్‌పా్‌సను నిర్మించడానికి ప్రతిపాదన చేశారు. దాంతో పాటు జంక్షన్‌లో పాదచారుల కోసం ప్రత్యేకంగా అండర్‌పాస్ ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవి పూర్తయితే జంక్షన్ పూర్తిగా మారిపోనుంది. సిగ్నల్, యూటర్న్ లేకుండా వాహనదారులు ప్రయాణం చేయడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌పై సర్వే చేస్తున్నారు.
ఏ సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి? ఏ వైపు నుంచి వస్తున్నాయి? అందులో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు చేరుకునే వాహనాలు ఎన్ని అనేదానిపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. దాంతో పాటు ఎలివేటెడ్ కారిడార్, అప్, డౌన్ ర్యాంపుల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో భౌగోళిక పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నారు. నిర్మాణ వ్యయాలపై అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను త్వరలోనే కన్సల్టెన్సీ ద్వారా రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఆమోదిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News