ఫీజు చెల్లిస్తేనే డిగ్రీ పాఠాలు!
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:27 AM
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు ప్రభుత్వ కాలేజీల్లో దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తిప్పలు మొదలయ్యాయి.
మొత్తం ఇస్తేనే ప్రవేశమంటున్న కాలేజీల నిర్వాహకులు
ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే సొమ్ము వెనక్కు ఇస్తామంటూ వెల్లడి
హైదరాబాద్ సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు ప్రభుత్వ కాలేజీల్లో దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తిప్పలు మొదలయ్యాయి. సీటు పొంది ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టు చేసిన విద్యార్థులు అడ్మిషన్ కోసం కాలేజీలకు వెళితే ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. అడ్మిషన్ ఇవ్వాలంటే విద్యా సంవత్సరం ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు షరతులు విధిస్తున్నాయి. విద్యార్థులు తమ కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినా ససేమిరా అంటున్నారు.
ముందు ఫీజు చెల్లించండి.. రీయింబర్స్‌మెంట్ వస్తే ఫీజులను వెనక్కి ఇస్తామని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఉచితంగా డిగ్రీ చదువుకోవచ్చునని భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తీవ్ర నిరాశకు గురువుతున్నారు. గడువు లోగా ఫీజు చెల్లించలేకపోతే తమ పరిస్థితి ఏంటి ? అని ఆందోళన చెందుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 13న దోస్త్ నోటిఫికేషన్ విడుదలవ్వగా.. ఇప్పటి వరకు మూడు విడతల్లో సీట్ల కేటాయింపు చేశారు.
సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టు చేసి ఆ తర్వాత నేరుగా సంబంధిత కళాశాలకు వెళ్లి ప్రవేశం పొందాలి. ఈ నెల 4వ తేదీ లోపు విద్యార్థులు తమకు సీటు దక్కిన కాలేజీల్లో రిపోర్ట్ చేసి ప్రవేశం పొందాలి. లేకపోతే సీటు కోల్పోతారు. మరోపక్క, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రభుత్వమే విద్యార్థుల ఫీజులు చెల్లిస్తుందనే సాకుతో ఉస్మానియా వర్సిటీ అనుబంధ, అటనామస్ కాలేజీల్లో కోర్సు ఫీజులను నాలుగేళ్ల క్రితం ఇష్టానుసారంగా పెంచేశారు.
నిజాం కాలేజీలో అడ్మిషన్లకు నిరాకరణ
నిజాం కాలేజీలో బీఏ, బీకామ్, బీఎస్సీలోని పలు గ్రూపులు ఉండగా.. ఆయా గ్రూపుల్లో సీట్లన్నీ విద్యార్థులకు ఖరారయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు నిజాం కాలేజీలో అడ్మిషన్ పొందడానికి వస్తే నిర్వాహకులు కోర్సు ఫీజు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని షరతు విధించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తే వారి నుంచి కోర్సు ఫీజు వసూలు చేసే వారు కాదు.
కానీ ఇప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించినా నిజాం కాలేజీలో ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇదే పద్ధతి నడుస్తోంది. ముందు ఫీజు చెల్లించాలని, రీయింబర్స్‌మెంట్ వస్తే సొమ్ము తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాకపోవడంతోనే కాలేజీలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News