చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు..
ABN , Publish Date - Jul 02 , 2026 | 07:43 AM
రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి కారణాలతో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి కారణాలతో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కో ప్రమాదంలో పదుల కొద్దీ ప్రాణాలు పోతుంటాయి. ఇలాంటి భారీ ప్రమాదాలు సాధారణంగా జాతీయ రహదారులపై జరుగుతుంటాయి. అయితే, ఇళ్ల మధ్య ఉన్న రోడ్లపైనా వాహనాలను అతివేగంగా నడిపి ఇతరులను ప్రమాదానికి గురి చేసే ఆకతాయిలు లేకపోలేదు. వీధుల్లో చిన్నారులు, వృద్ధులు ఉంటారనే కనీస స్మృహ లేకుండా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను @raghu_bish9e అనే యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రకారం.. ఇళ్ల మధ్య ఉన్న రోడ్డుపై ఓ తల్లి తన కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె తలపై కొన్ని సామాన్లు మోసుకుంటూ ముందుకు వెళ్తుండగా, బాలుడు ఆమె వెనుక చిప్స్ ప్యాకెట్ పట్టుకుని వస్తున్నాడు. తల్లికి, కుమారుడికి మధ్య కొంత దూరం ఉండగా చిన్నారి ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వారికి ఎదురుగా అతివేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తల్లి గమనించింది. కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెనక్కి తిరిగి చూసింది. అదే సమయంలో రోడ్డు దాటుతూ తల్లి వద్దకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు బాలుడు. ఇంతలో అటుగా వచ్చిన ద్విచక్రవాహనం ఒక్కసారిగా చిన్నారిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు దూరంగా ఎగిరిపడ్డాడు.
ఈ ప్రమాదాన్ని చూసిన తల్లి తన తలపై ఉన్న సామగ్రిని కింద పడేసి బాలుడి వద్దకు పరిగెత్తింది. పలువురు స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ద్విచక్రవాహనంపై ఉన్న ఓ యువకుడు, బాలుడు తమ వాహనాన్ని ఆపి చిన్నారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అనంతరం తల్లితో కలిసి చిన్నారిని తమ బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన రహదారులపై, అలాగే ఇళ్ల మధ్య ఉన్న రోడ్లపై వాహనాలను ఎంత జాగ్రత్తగా నడపాలో తెలియజేస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..
ముంబైలో షాకింగ్ ఘటన.. వర్షంలో విద్యార్థినులకు కరెంట్ షాక్.. చివరికి..