Share News

సమాధానం చెప్పను.. అరెస్టు వీడియోను యూట్యూబ్‌లో పెడతా: ప్రశ్న రావణ్..

ABN , Publish Date - Jul 02 , 2026 | 08:20 AM

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.

సమాధానం చెప్పను.. అరెస్టు వీడియోను యూట్యూబ్‌లో పెడతా: ప్రశ్న రావణ్..
YouTuber Prashna Ravan Case

కాకినాడ: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్న (బుధవారం) రాత్రి ఓ కేసులో బెయిల్‌పై విడుదలైన వెంటనే, మరో కేసులో భాగంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. 2025లో గొల్లప్రోలు మండలంలో పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా ఎందుకు చిత్రీకరిస్తూ వీడియో చేశారని పోలీసులు ప్రశ్నించారు.


అలాగే, ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన మరికొన్ని ప్రశ్నలను సంధించారు. అయితే, రావణ్ మాత్రం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనను ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పనని, యూట్యూబ్‌లో తన అరెస్టుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తానని తెలిపినట్లు సమాచారం. దీంతో తన ఛానెల్‌కు చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో, ఈరోజు (గురువారం) సాయంత్రం రావణ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


కాగా, ఏలూరులో జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాధా మనోహర్‌దాస్‌లపై రావణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించాడని, రావణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పిఠాపురం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. అయితే, ఆ కేసులోనూ రావణ్ సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. చివరికి అతడిని నిన్న రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిరాకరిస్తూ బెయిల్ ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

జడ శ్రావణ్‌పై 4 స్టేషన్లలో కేసుల నమోదు

ముందే గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్‌

Updated Date - Jul 02 , 2026 | 09:21 AM