ముందే గుర్తిస్తే క్యాన్సర్‌కు చెక్
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:08 AM
క్యాన్సర్ ప్రాణాంతకమే. కానీ వ్యాధిని ముందే గుర్తిస్తే నివారణ కూడా సాధ్యమే. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో ఉంది. ప్రాథమిక స్థాయి నుంచే క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం....
ప్రాథమిక స్థాయిలోనే నివారించాలన్నదే లక్ష్యం
అట్లా్‌సతో క్యాన్సర్ కారణాలు గుర్తించే వీలు
మహిళలకు వచ్చే క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం
మూడేళ్లలో 30 లక్షల మంది మహిళలకు స్ర్కీనింగ్
దీని వల్ల వ్యాధి ఉంటే ముందే బయటపడుతుంది
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో కేసులు తగ్గించొచ్చు
రాష్ట్రంలో 84శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. దేశంలో టాప్
క్యాన్సర్ నివారణ, నియంత్రణలో ఆదర్శంగా ఏపీ
జాతీయ సగటు కంటే రాష్ట్రంలో తక్కువ కేసులు
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఎర్లీ స్టేజీ కేసులు గుర్తించడం మంచి పరిణామం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘క్యాన్సర్ ప్రాణాంతకమే. కానీ వ్యాధిని ముందే గుర్తిస్తే నివారణ కూడా సాధ్యమే. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో ఉంది. ప్రాథమిక స్థాయి నుంచే క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం’’ అని ప్రఖ్యాత అంతర్జాతీయ క్యాన్సర్ వైద్య నిపుణుడు, ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ కేర్ విభాగానికి ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. క్యాన్సర్ అట్లాస్ తయారు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. దీనిని మైక్రో లెవల్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పారు. తమ ఫోకస్ మొత్తం మహిళల్లో క్యాన్సర్లను నివారించే అంశంపై పెట్టామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 30 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది పూర్తయితే మహిళల్లో క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి.. మొదటి దశలోనే నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ నివారణ, నియంత్రణలో ఏపీ దేశానికి మార్గదర్శకంగా ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దానికి అనుగుణంగానే రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు..
క్యాన్సర్ అట్లాస్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష
ఇప్పటికే రాష్ట్రస్థాయిలో క్యాన్సర్ అట్లా్‌సను సిద్ధం చేశాం. తొలి ముసాయిదాను జనవరిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేయించాం. క్యాన్సర్ అట్లాస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుని, సమీక్షలు చేస్తున్నాం. ఏపీలో ప్రమాదకర పరిస్థితి లేదు. భారీ స్థాయిలో కేసులు పెరగడం లేదు. కొన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నా.. అవి అదుపులోనే ఉన్నాయి. జిల్లాల్లో సగటు లక్షకు వంద కంటే తక్కువగా కేసులు నమోదవుతూ ఉండడం మంచి పరిణామం. అన్ని జిల్లాల్లో దాదాపుగా ఒకే రకంగా కేసులు నమోదవుతున్నాయి. జాతీయ సగటు100 నుంచి 110 వరకు ఉంది. మన రాష్ట్రంలోని జిల్లాల్లో 70 నుంచి 85 వరకే ఉంది. ఇది మంచి పరిణామం. ప్రతి నెల అమెరికా నుంచి జూమ్ మీటింగ్‌లు పెట్టి, మూడు నెలలకు ఒకసారి ఏపీకి వచ్చి ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నాను. బుధవారం కూడా రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం.
స్క్రీనింగ్ 4.0 ఆగస్టుకు పూర్తవుతుంది
సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ మార్గదర్శకత్వంలో క్యాన్సర్ నివారణకు చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. గ్రామస్థాయిలో క్యాన్సర్ స్ర్కీనింగ్ చేస్తున్నాం. మొదటి విడత స్క్రీనింగ్ లో మంచి ఫలితాలు వచ్చాయి. క్యాన్సర్ స్క్రీనింగ్ 3.0ను 2024 నవంబరు నుంచి 2025 ఆగస్టు వరకూ 2.9 కోట్ల మందికి చేశాం. 2025 సెప్టెంబరులో స్క్రీనింగ్ 4.0ను ప్రారంభించాం. ఈ ఏడాది ఆగస్టుకు పూర్తిచేస్తాం. 2 వేల మంది బాధితులను గుర్తించాం. ఏపీలో స్క్రీనింగ్ అద్భుతంగా జరుగుతోంది. కేంద్ర ం అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఏపీ బాగా చేస్తోంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్ కేసులను భారీగా తగ్గించవచ్చు. ఏపీలో 3.48 లక్షల మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 2.88 లక్షల మందికి పూర్తి చేశారు. 84 శాతం వ్యాక్సిన్ పూర్తయినట్లే. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉంది.
క్యాన్సర్ నివారణలో ఏపీ టాప్
జాతీయ స్థాయితో పోల్చితే క్యాన్సర్ నివారణలో ఏపీ టాప్‌లో ఉంది. రోడ్ మ్యాప్, ఆచరణ స్పష్టంగా ఉండటంతో ఫలితాలు సంతృప్తికరంగా వస్తున్నాయి. క్యాన్సర్ స్ర్కీనింగ్, టెస్టింగ్ సామర్థ్యాన్ని ఏపీలో భారీగా పెంచుతున్నారు. ఇది మంచి పరిణామం. గుంటూరులో పెట్ స్కాన్ ఏర్పాటు చేశారు. మరిన్ని చోట్ల కూడా స్కానింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్యాన్సర్‌ను చివర స్టేజ్‌లో కంటే ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా ఆస్పత్రుల్లో గుర్తించిన విషయం ఏమిటంటే.. వారు ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానం ప్రైవేట్ సెక్టార్‌లో రావడం మంచి పరిణామం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కష్టానికి ఫలితాలు కనిపిస్తేంటే హ్యాపీగా ఉంది.
మహిళలకు మేలు జరిగేలా..
రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ స్పాన్సర్స్ నిధులతో మహిళలకు స్ర్కీనింగ్ చేపట్టాలని నిర్ణయించాం. దీని వల్ల ఎంతో మంది మహిళలకు మేలు జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్ర్కీనింగ్‌లో కొత్త టెక్నాలజీ వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా చిన్న పరికరంతో ఇబ్బంది లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ స్ర్కీనింగ్ ప్లాన్ చేస్తున్నాం. దీనిని ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వానికి రోడ్‌మ్యాప్ ఇచ్చాను.
డీఎన్‌ఏ టెస్టింగ్‌తో మంచి ఫలితాలు
ఏపీ ప్రభుత్వ సహకారంతో హెచ్‌పీబీ డీఎన్‌ఏ టెస్టింగ్ చేయడానికి సిద్ధం అయ్యాం. హైరిస్క్ వాళ్లకి ఈ టెస్ట్ చేస్తే క్యాన్సర్ పాజిటివా లేదా నెగిటివా అనేది సులువుగా తెలుస్తుంది. మంచి ఫలితాలు కూడా వస్తాయి.
అట్లాస్ వల్ల ఎంతో ప్రయోజనం..
అట్లాస్ వల్ల మైక్రో లెవల్‌లో డేటా వస్తుంది. ప్రస్తుతం మన డేటా మన దగ్గర లేకపోవడం వల్ల ఐసీఎంఆర్ డేటాపై ఆధారపడాల్సి వస్తోంది. ఐసీఎంఆర్ డేటాపై పూర్తిస్థాయి నమ్మకం లేదు. క్యాన్సర్ అట్లాస్ ద్వారా మన డేటా మన దగ్గర ఉండడంతో పాటు ఐసీఎంఆర్‌కు మనమే డేటా ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీంతో పాటు అట్లాస్ వల్ల జిల్లా, మండల, చివరికి గ్రామస్థాయిలో కూడా క్యాన్సర్ కేసులను గుర్తించవచ్చు. ఎక్కడెక్కడ ఎక్కువ కేసులున్నాయి, అవి రావడానికిగల కారణాలు, నివారణ మార్గాలను సూచించడానికి వీలవుతుంది. ఎక్కువ కేసులున్న చోట రిసోర్స్‌ను ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అడ్వాన్స్ కేసులు తగ్గి, ఎర్లీ కేసులను గుర్తించేందుకు వీలుంటుంది. ఎర్లీ క్యాన్సర్ కేసులపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తాం. ఏపీలో లక్షకు 72 మంది క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇది 2030 నాటికి 20 శాతం పెరిగే అవకాశం ఉందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే ఏపీలో మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఐసీఎంఆర్ అంచనాను పూర్తిగా కంట్రోల్ చేస్తాం. చేయగలం కూడా. ఐసీఎంఆర్ ప్రొజెక్షన్‌ను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
డాక్టర్ నోరికి ఘన సన్మానం
క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడమే తన లక్ష్యమని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. బుధవారం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో భాగంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ర్టాల్లో క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును తీసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. దత్తాత్రేయుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని సభాధ్యక్షుడు గోళ్ల నారాయణరావు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనరసింహ, అక్కినేని భవానీప్రసాద్, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.