సవాళ్లు - ప్రతి సవాళ్లు.. చర్చలకు సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 08:32 AM
తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, జులై 02: తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. దీంతో గత ప్రభుత్వ అప్పులపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కేటీఆర్ సిద్ధమైతే తెలంగాణ భవన్‌కు వస్తానంటూ జూపల్లి సవాల్ విసిరారు. దీంతో గురువారం ఉదయమే కేటీఆర్, హరీశ్ రావులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
మరో వైపు గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ నేతలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఈ అంశంపై హరీశ్, కేటీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్ వస్తే గన్‌పార్క్‌కు వెళ్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీనిపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రతి సవాల్ విసిరారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు ఆధారాలతో ప్రెస్ క్లబ్‌కు వస్తానన్న ఆయన ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ప్రెస్ క్లబ్‌కు వచ్చి చర్చిస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి సవాల్..
రాష్ట్రంలో అప్పులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చకు లేఖ రాయాలని ఆయనను డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసి తోక ముడవడం కాదు.. వాటిని నిరూపించాలని హరీశ్ రావుకు సవాల్ చేశారు. హరీశ్ రావు ఆరోపణలు చేసి.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చర్చకు రమ్మనడం ఏమిటని మంత్రి అడ్లూరి సందేహం వ్యక్తం చేశారు.
ధైర్యం ఉంటే రూ.2వేల కోట్ల అవినీతి ఆరోపణలు నిరూపించాలని హరీశ్‌రావును ఆయన డిమాండ్ చేశారు. రూ.1100 కోట్ల టెండర్లలో రెండు వేల కోట్ల రూపాయిల అవినీతి అంటూ తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చిట్టా తమ వద్ద ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరి లెక్కలు తేలుస్తామని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ రెండున్నరేళ్లలో భారీగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ కూడా అత్యధికంగా అప్పులు చేసిందని మంత్రులు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని వారు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేశారని విమర్శించారు. దాంతో ఇరు పార్టీల నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్
హామీ ఇచ్చి.. ఓసీ ఎగ్గొట్టడం కోర్టును మోసం చేయడమే
For More TG News And Telugu News