Share News

హామీ ఇచ్చి.. ఓసీ ఎగ్గొట్టడం కోర్టును మోసం చేయడమే

ABN , Publish Date - Jul 02 , 2026 | 05:02 AM

ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ (ఓసీ) లేదా భవన నిర్మాణం ప్రణాళికాబద్ధంగానే పూర్తయిందని సంబంధిత మున్సిపాలిటీ ఇచ్చే నిరభ్యంతర పత్రం ....

హామీ ఇచ్చి.. ఓసీ ఎగ్గొట్టడం కోర్టును మోసం చేయడమే

  • పిటిషనర్ల హామీని నమ్మి వారికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నాం

  • ఎగ్గొట్టినవారి లెక్కలివ్వండి.. విద్యుత్‌ శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ (ఓసీ) లేదా భవన నిర్మాణం ప్రణాళికాబద్ధంగానే పూర్తయిందని సంబంధిత మున్సిపాలిటీ ఇచ్చే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తర్వాత అందజేస్తామని.. ముందు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వేల మంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారి హామీని విశ్వసించి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే విద్యుత్‌ కనెక్షన్‌ పొందిన వారిలో ఎంతమంది ఓసీ సమర్పిస్తున్నారన్న లెక్కలు లేవు.. ఓసీ తర్వాత సమర్పిస్తామన్న హామీతో విద్యుత్‌ కనెక్షన్‌ పొంది ఓసీ సమర్పించకపోవడం అంటే కోర్టును మోసం చేయడం కిందికే వస్తుంద’ని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓసీ తర్వాత ఇస్తామని ముందు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ఒక పిటిషన్‌లో జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో విద్యుత్‌ కనెక్షన్‌ పొందిన వారు.. ఆ తర్వాత ఓసీ వచ్చిందని సదరు కాపీ సమర్పించినవారు ఒక్కరు కూడా లేరని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఫలానా పిటిషనర్లు విద్యుత్‌ కనెక్షన్‌ పొంది కూడా ఓసీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ కూడా హైకోర్టుకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో అండర్‌టేకింగ్‌ ఇవ్వడం ద్వారా ఎంతమంది విద్యుత్‌ కనెక్షన్‌ పొందారు? ఆ తర్వాత ఎంతమంది ఓసీ ఇచ్చారు? ఇంకా ఎంతమంది ఇవ్వాలి? హామీని నిలబెట్టుకోని వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే వివరాలతో నివేదిక సమర్పించాలని తెలంగాణ ట్రాన్స్‌కో ఎండీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - Jul 02 , 2026 | 05:03 AM