జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్, బీజేపీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:41 PM
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీఫారం అందించేందుకు మంగళవారం వరకు గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
అభ్యర్థులకు సమాచారం అందించిన బీఆర్‌ఎస్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీ చేసే అభ్యర్థులు బీఫారం అందించేందుకు మంగళవారం వరకు గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. బీఆర్‌ఎస్ తమ అభ్యర్థులకు సమాచారం అందించిందని తెలిసింది.
ఇక ప్రచారంపై దృష్టి
కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ రెండు విడతలుగా సమావేశమై అభ్యర్థుల విషయమై చర్చించి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జాబితాను అప్పగించింది. సోమవారం రాత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక ప్రచారంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టనున్నాయి.
బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. పార్టీలో ఒక్కో స్థానంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేయగా అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించకుండా నామినేషన్లను వేసిన వారిని పిలిపించి అభ్యర్థి ఎవరో చెబుతూ మిగతా వారిని ఉపసంహరణ కోసం బుజ్జగిస్తున్నారు. ఎంపిక చేసిన వారికి బీఫారం ఇచ్చినట్లు తెలిసింది.
ఎంఐఎం పార్టీ కార్పొరేషన్ పరిధిలో బలమైన శక్తిగా ఉంది. ఆ పార్టీ ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి బీఫారాలు అందజేసింది. మిగతావారి వివరాలను మంగళవారం వెల్లడించే అవకాశముంది.
బీజేపీ తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. జిల్లా నుంచి త్రిసభ్య కమిటీ పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగా 66 మంది అభ్యర్థుల జాబితాను రూపొందించింది. ఈ జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఖరారు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రచారానికి సోమవారం శ్రీకారం చుట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News