తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:34 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly) కొనసాగుతున్నాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘పెన్షన్ పెంచనందుకు ధన్యవాదాలు చెప్పాలా? నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు ధన్యవాదాలు చెప్పాలా.. ఉద్యోగులను మోసం చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. ‘రేషన్ కార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి. యంగ్ ఇండియా స్కూల్ కట్టినందుకు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి’ అని అన్నారు. కేటీఆర్ ఓపికగా ఉండాలని మంత్రి హితవుపలికారు. ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని.. వాటికి తాము వడ్డీ కడుతున్నామని.. అందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీటైన జవాబిచ్చారు.
కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం ఫైర్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కోటి ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా అని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు. రూ.22,500 కోట్లతో ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.
రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ‘మీలా మేము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వకుండా వదల్లేదు. మూడు ఎకరాలు ఇస్తామని ఇవ్వకుండా వదిలేయలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేయలేదు. మీరు తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూనే ఈ పనులన్నీ చేస్తున్నాం’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్నట్టుగా పాలన: కేటీఆర్
సీఎం తొలి సంతకం పెట్టిన ఫైలుకే దిక్కులేదని, ఇంకా ఈ ప్రభుత్వం మాటలు ఎవరు నమ్ముతారని కేటీఆర్ విమర్శించారు. ‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామన్నారు.. ఇచ్చారా’ అని ప్రశ్నించారు. ఈ రెండున్నర సంవత్సరాలు ప్రజలకు పరిహాస నామ సంవత్సరంగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్నట్లుగా రెండేళ్ల పాలన సాగిందన్నారు. ప్రజా పాలనలో ప్రజలు కోటీ 85 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారని.. ఎక్కడికి పోయాయి ఆ దరఖాస్తులు అని ప్రశ్నిస్తూ.. గల్లంతయ్యాయా అంటూ కేటీఆర్ నిలదీశారు. టీ 20 మాదిరిగా 420 పోటీలు పెడితే ఈ ప్రభుత్వమే గెలుస్తుందంటూ మాజీ మంత్రి సెటైర్ విసిరారు. సీఎం తీరు ఎన్నికల ముందు దానకర్ణ.. ఆ తర్వాత కుంభకర్ణలా మారిందన్నారు. అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌ది ఊకదంపుడు ఉపన్యాసం: మంత్రి శ్రీధర్ బాబు
ప్రభుత్వానికి కేటీఆర్ సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారంటూ విమర్శించారు. ప్రధానమంత్రి దగ్గరకు కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో లెక్క తీయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతామని.. ప్రధానిని మంత్రులను కలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్‌లా తాము ఢిల్లీకి వెళ్లడం లేదని అన్నారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయింది బీఆర్‌ఎస్ అంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఢిల్లీకి వెళ్తే నిధుల తెస్తారనుకున్నాం: కేటీఆర్
మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మాకు అభ్యంతరం లేదు. మీరు ఢిల్లీకి పోతే నిధులు తెస్తారని అనుకున్నాం. కానీ మీరు ఢిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చేసి వస్తున్నారు. రూ.3.60 లక్షల కోట్ల ఐటీ ఎక్స్‌పోర్ట్స్ అని మంత్రి బయట చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగంలో రూ.7 వేల కోట్లు తగ్గాయని చెప్పారు’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
డ్రగ్స్ కేసు.. పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు
అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే
Read Latest Telangana News And Telugu News