Share News

తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:41 PM

తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా
Telangana Assembly

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ శాసనసభ(Telangana Assembly) వాయిదా పడింది. ఈరోజు సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ప్రజా క్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది సర్కార్. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ‘మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం’ అని భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.


బీఆర్‌ఎస్ వాకౌట్

కాగా... ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగతుండగానే సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. అన్ని వర్గాలను మోసం చేశారంటూ.. చెవిలో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను చించివేశారు. బడ్జెట్ మొత్తం మోసం.. మోసమంటూ బీఆర్‌ఎస్ సభలో నిరసనలు తెలిపింది. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవంటూ బీఆర్‌ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.


బడ్జెట్ ప్రతులను చించడం బాధాకరం: దానం నాగేందర్

సభ నుంచి బీఆర్‌ఎస్‌ నేతల వాకౌట్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నీళ్లు కూడా తాగలేదన్నారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు మాత్రం బడ్జెట్‌ను విమర్శిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రతులను చించివేయడం బాధాకరమన్నారు. ఈ బడ్జెట్ పేదలు, బీసీ, ఎస్సీ, విద్యార్థులకు ఉపయోగకరమైనదన్నారు. పేదలు, విద్యార్థుల గురించి మాట్లాడే సమయంలోనే బీఆర్ఎస్ వాళ్లు వెళ్లిపోయారని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మొదలైన తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 03:06 PM