మళ్లీ ఒకేసారి.. వచ్చేనెల రేషన్ దుకాణాల్లో మూడు నెలల బియ్యం పంపిణీ
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:18 PM
రేషన్ లబ్ధిదారులకు మళ్లీ మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా అందనుంది.
ఏర్పాట్లు చేస్తున్న పౌర సరఫరాల శాఖ
‘ఎల్‌నినో’ను దృష్టిలో ఉంచుకుని చర్యలు
మరోవైపు నిల్వ సామర్థ్యం కొరతతో డీలర్ల ఆందోళన
హైదరాబాద్ సిటీ: రేషన్ లబ్ధిదారులకు మళ్లీ మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా అందనుంది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయనున్నాయి. డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ.. కార్డుదారుల సంఖ్యను తెలియజేస్తే నెలాఖరులోగా బియ్యం మొత్తాన్ని సరఫరా చేస్తామని తెలిపాయి.
గ్రేటర్‌లోని హైదరాబాద్ జిల్లాలో 8,42,348, రంగారెడ్డిలో 6,72,909, మేడ్చల్‌లో 6,53,801 కార్డులున్నాయి. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో నెలకు సుమారు 39,75,0277 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాగే చక్కెర, గోధుమలను కూడా అందజేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే విడతలో సరఫరా చేశారు. అయితే, ఈ-పాస్ యంత్రం మొరాయించడంతో కొందరు రోజుల తరబడి తిరిగారు. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్న అధికారులు.. లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిస్ నమోదులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నారు.. ఒక్కో కార్డుదారుడికి 5 నిమిషాల్లోపే ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
బియ్యం నిల్వలపై డీలర్ల ఆందోళన
మూడు నెలల కోటాకు సంబంధించిన బియ్యం ఒకేసారి పంపిణీతో అందుకు తగ్గట్టుగా నిల్వలు చేసేందుకు సరిపడా గదులు లేవని కొంతమంది డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు రేషన్ దుకాణాలు చిన్నపాటి గదుల్లో నిర్వహిస్తుండడమే కారణంగా నిలుస్తోంది. గత వేసవిలో మూడు నెలల బియ్యం ఒకేసారి సరఫరా చేయడంతో వాటిని భద్రపరిచి లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్లు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మళ్లీ మూడునెలల సరుకు ఒకేసారి వస్తుండడంతో కార్డుల సంఖ్య ఎక్కువ ఉన్న డీలర్లు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన నిల్వలను ఎక్కడ భద్రపరచాలని సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ఇళ్లలోనే నిల్వలను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు పదిరోజుల్లో విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.
పూర్తికాని ఈ-కేవైసీ
గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో రేషన్ ఎలక్ర్టానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రెండు నెలలుగా ఇది కొనసాగుతున్నప్పటికీ కొంతమంది ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 31లోపు కచ్చితంగా చేసుకోవాలని అధికారులు నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. ఆధార్ అప్‌డేట్ అయిన తర్వాతే ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు, ఐరిష్ నమోదు అవుతాయని చెబుతుండడంతో హైరానా పడుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ-కేవైసీ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో 80 శాతం, రంగారెడ్డిలో 76, మేడ్చల్‌లో 78 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్ చేశారు!
సిగ్గుతో తలదించుకుంటున్నా.. క్షమించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News