Share News

ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్‌ చేశారు!

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:30 AM

జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబసమస్యలపై తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే.. భయపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని చిత్రీకరించి.. బెదిరింపులకు గురిచేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని..

ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్‌ చేశారు!

  • ఆ వీడియోలతో తీవ్ర బెదిరింపులు

  • పలుమార్లు అత్యాచారం, అబార్షన్‌

  • జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై వివాహిత ఆరోపణలు

  • డీజీపీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు

  • తన నుంచి విడతలవారీగా రూ.2కోట్లు తీసుకున్నారని వెల్లడి

  • ఫిర్యాదులో ఆ లావాదేవీల వివరాలు.. వీఆర్‌కు సీఐ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబసమస్యలపై తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే.. భయపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని చిత్రీకరించి.. బెదిరింపులకు గురిచేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు రెడ్డి గతంలో అమీన్‌పూర్‌ సీఐగా పనిచేశారని, అప్పట్లో తాను కుటుంబసమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన కారణంగా తాను గర్భం దాల్చానని, తర్వాత ఆయనే తనను ఆస్పత్రికి తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్‌ చేయించారని, ఆస్పత్రి రిపోర్టులో తాను ఉపయోగించే ఫోన్‌ నంబరునే రాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోలు అడ్డం పెట్టుకొని తీవ్ర బెదిరింపులకు పాల్పడి తన నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. ఈ మేరకు డబ్బుకు సంబంధించి ఆధారాలుగా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ పత్రాలను ఫిర్యాదుకు జతచేశారు. సీఐగా హైదరాబాద్‌ పరిధిలోకి బదిలీ చేయించుకునేందుకు రూ.25 లక్షలు ఖర్చు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.


తాను ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయానికి పలుమార్లు వెళ్లానని, అక్కడ సీపీ వ్యవహారాలు చూసే సీసీ శ్రీధర్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కలిసి తనను హైదరాబాద్‌ సీపీని కలవనీయకుండా చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వదిలేయాలని శ్రీనివాసులు రెడ్డిని తాను బతిమాలుకున్నానని, తనను ఆయన రక్తం వచ్చేలా కొరికి.. హింసించారని ఫిర్యాదులో వివరించారు. కాగా ఈ ఫిర్యాదుపై విచారణ బాధ్యతను మల్టీజోన్‌ ఐజీ షానవాజ్‌ ఖాసీమ్‌కు డీజీపీ ఆనంద్‌ అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదును రికార్డు చేయాలని వెస్ట్‌జోన్‌ డీసీపీని డీజీపీ ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదులోని ఆరోపణలను పరిశీలిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జూబ్లీహిల్స్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఆయన్ను వీఆర్‌ అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేంద్రనగర్‌ సీఐ ముత్తు యాదవ్‌ను జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు.

Updated Date - Jul 29 , 2026 | 08:30 AM