Share News

ప్రకృతి సూపర్‌ హీరోలుగా గబ్బిలాలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:39 AM

గబ్బిలాలు అంటే చాలామందికి భయం, అపోహలే గుర్తుకు వస్తాయి. కానీ అవే ప్రకృతికి నిజమైన సూపర్‌ హీరోలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం తేల్చింది.

ప్రకృతి సూపర్‌ హీరోలుగా గబ్బిలాలు
Gachibowli, Hyderabad

  • వేలాది కీటకాలను తిని పంటలు, ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకం

  • కోలార్‌ గబ్బిలాలపై ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ అధ్యయనం

  • ఓయూ పరిశోధకుల పరిశోధన

హైదరాబాద్: గబ్బిలాలు అంటే చాలామందికి భయం, అపోహలే గుర్తుకు వస్తాయి. కానీ అవే ప్రకృతికి నిజమైన సూపర్‌ హీరోలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం తేల్చింది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో నివసించే అత్యంత అరుదైన గబ్బిలాల జాతులు వేలాది కీటకాలను ఆహారంగా తీసుకుంటూ రైతుల పంటలను, ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాయని పరిశోధన వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా డీఎన్‌ఏ మెటబార్‌కోడింగ్‌ సాంకేతికతతో గబ్బిలాల ఆహారాన్ని విశ్లేషించిన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక ‘‘జర్నల్‌ ఆఫ్‌ త్రెటెన్డ్‌ టాక్సా’’లో ప్రచురితమయ్యాయి.


ఒకే గుహలో ప్రపంచంలోనే అరుదైన గబ్బిలం జాతి

కోలార్‌ జిల్లా హనుమనహళ్లి గుహలో నివసించే నాలుగు రకాల ఆకు-ముక్కు గబ్బిలాలపై ఈ అధ్యయనం సాగింది. ప్రపంచంలోనే అంతరించిపోతున్న కోలార్‌ రౌండ్‌లీఫ్‌ బ్యాట్‌ ఈ గుహలో మాత్రమే జీవిస్తోంది. ప్రస్తుతం ఈ జాతికి చెందిన గబ్బిలాల సంఖ్య 300 కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


డీఎన్‌ఏతో ఆహారపు అలవాట్ల విశ్లేషణ

అత్యాధునిక డీఎన్‌ఏ మెటబార్‌కోడింగ్‌ పద్ధతిని ఉపయోగించి గబ్బిలాల విసర్జనను విశ్లేషించిన పరిశోధకులు ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. ఒక్క కోలార్‌ రౌండ్‌లీఫ్‌ గబ్బిలమే 4,100కు పైగా కీటకాల జాతులను ఆహారంగా తీసుకుంటుందని తేలింది. అదే గుహలోని ఇతర గబ్బిలాల జాతులు ఒక్కొక్కటి 1,200 నుంచి 2,400 రకాల కీటకాలను తింటున్నట్లు అధ్యయనం వెల్లడించింది.


రైతులకు ఉచిత సహజ సేవ

గబ్బిలాలు తెగుళ్లను నియంత్రించడం ద్వారా రైతులకు అమూల్యమైన సహజ సేవ అందిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, దీనివల్ల వ్యవసాయ వ్యయాలు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని వివరించారు.


ప్రతి జాతికి ప్రత్యేక ఆహార అలవాట్లు

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రతి గబ్బిల జాతి ప్రత్యేక రకాల కీటకాలను మాత్రమే ఎక్కువగా ఆహారంగా ఎంచుకుంటుందని గుర్తించారు. దీంతో అవి పరస్పర పోటీ లేకుండా ఒకే ప్రాంతంలో సహజీవనం చేస్తూ విస్తృత స్థాయిలో తెగుళ్ల నియంత్రణలో భాగస్వాములవుతున్నాయని పరిశోధకులు వివరించారు. కాలానుగుణంగా వాటి ఆహారపు అలవాట్లు మారడం కూడా వాటి అనుకూలతను సూచిస్తోందని తెలిపారు.


డెంగ్యూ, మలేరియా దోమలకూ చెక్‌

గబ్బిలాలు సాధారణ కీటకాలనే కాకుండా డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలను కూడా ఆహారంగా తీసుకుంటున్నాయని పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాదు, టమాటా పంటను తీవ్రంగా దెబ్బతీసే లీఫ్‌ మైనర్‌ చిమ్మటలు, బ్యాక్టీరియా, వైర్‌సలను మోసే బొద్దిలింగాలను కూడా తింటున్నాయి. దీంతో పంటల రక్షణతో పాటు ప్రజారోగ్యానికి కూడా ఇవి ప్రత్యక్షంగా మేలు చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


భారతదేశంలో ఇదే తొలిసారి..

భారతదేశంలో గబ్బిలాల ఆహారాన్ని డీఎన్‌ఏ మెటబార్‌కోడింగ్‌ ద్వారా విశ్లేషించడం ఇదే తొలిసారని ఓయూ వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ టాక్సోనమీ ల్యాబ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ చెల్మల శ్రీనివాసులు చెప్పారు. గబ్బిలాలపై ప్రజల్లో ఉన్న అపోహలకు ఈ పరిశోధన సమాధానం చెబుతోందని అధ్యయన ప్రధాన రచయిత్రి డా.భార్గవి శ్రీనివాసులు, సహ రచయిత డాక్టర్‌ ఆదిత్య శ్రీనివాసులు తెలిపారు. ఓయూ వీసీ కుమార్‌ పరిశోధక బృందాన్ని అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్‌ చేశారు!

సిగ్గుతో తలదించుకుంటున్నా.. క్షమించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 11:46 AM