ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:58 AM
ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది.
కుటుంబాలను పోషించుకుంటూనే బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కల సాకారం
యూజీ, పీజీ కోర్సులకు అనుమతి
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
రెగ్యులర్ విద్యార్థుల మాదిరే పరీక్షలు
‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వర్తించదు
అమరావతి: ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా ‘వర్కింగ్ ప్రొఫెసనల్స్‌కు అడ్మిషన్లు’ విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీఈటీ అనుమతులు తెచ్చుకున్న కాలేజీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తాయి.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, ఎంఎ్‌సఎంఈలు, ఇతర రిజిస్టర్డ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పనిచేసుకుంటూనే ఈ కోర్సులు చేయొచ్చు. ఈ విధానంలో చదివేవారిని రెగ్యులర్ కోర్సులు చదివినట్లుగానే పరిగణిస్తారు. యూజీలో బీటెక్ లేదా బీఈ, పీజీలో ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు వారి కార్యాలయం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ద్వితీయ సంవత్సరంలో కోర్సులో చేరే విద్యార్థుల తరహాలో(లేటరల్ ఎంట్రీ) అర్హతలు కలిగి ఉండాలి. ఒక్కో కాలేజీలో గరిష్ఠంగా మూడు కోర్సులను కాలేజీలు అందించే అవకాశం ఉంది.
పీజీలో గరిష్ఠంగా 30, యూజీలో 60 సీట్లు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి. అనుమతించిన సీట్లలో మూడింట ఒక వంతు అడ్మిషన్లు భర్తీ అయితే కోర్సును కొనసాగిస్తారు. కోర్సుల సిలబస్, పరీక్షలు కూడా రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ సమయానికి కనీసం ఏడాదికాలం ఉద్యోగంలో పనిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడ్మిషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అన్ని అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు.
ఒక్కో విద్యా సంస్థలో ఒక సీటును కేంద్ర ప్రభుత్వ, పరిశ్రమలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగులకు రిజర్వ్ చేస్తారు. కన్వీనర్ కోటాకు నిర్ణయించిన ఫీజులను ఉద్యోగులు చెల్లించాలి. ఈ అడ్మిషన్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదు. ఈ విధానంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఉండవు. కాలేజీలు ఏఐసీటీఈతో పాటు రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీ, ప్రభుత్వ అనుమతి పొందాలి. 2026-27(ప్రస్తుత) విద్యా సంవత్సరం నుంచి కాలేజీలు అడ్మిషన్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News