బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:15 PM
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
అమరావతి: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభక హాజరై.. వైసీపీ నేతలను కలిసిన వ్యవహారంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు బొండా ఉమా హాజరై తన వివరణను అందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు బొండా ఉమాకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి టీడీపీ చేసిన మేలు, ప్రత్యర్థి పార్టీ చేసిన ద్రోహం గురించి మీకు బాగా తెలుసు కదా? అని మంత్రి నిమ్మల.. బోండా ఉమాతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన విషయాన్ని మాత్రం తాము తప్పుబట్టడం లేదని పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది.
అయితే సభ అనంతరం బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందునే వివరణ కోరాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించిన వ్యక్తులతో సఖ్యతగా కనిపించడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయని వారు అభిప్రాయపడ్డారు. అలాగే తమ వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశం ఉన్న మీడియా సంస్థలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని కూడా బొండా ఉమాను ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బోండా ఉమా.. సమన్వయ లోపం కారణంగానే కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తిని కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బొండా ఉమ వివరణతో సంతృప్తి చెందిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:
బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్.. టాప్ 10లో పాకిస్థాన్ బ్యాటర్