బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:37 PM
బీఆర్ఎస్ పాలనపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్, జులై 28: బీఆర్ఎస్ పాలనపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని కవితకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాడారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకు ఇబ్బంది రానివ్వమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైడ్రా మంచిదని సాధారణ ప్రజలు చెబుతున్నారని తెలిపారు. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీ తీస్తున్నారని చెప్పారు. అయితే హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు.
తాము చెప్పాల్సింది కోర్టుకు చెబుతామని అన్నారు. రాజకీయం కోసమే హైడ్రాకు వ్యతిరేకమైన పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు. హైడ్రాకి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కోర్టు పూర్తి తీర్పు ఇంకా రాలేదని గుర్తు చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తోందంటూ బీఆర్ఎస్ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు.