భారీ వర్షాలు.. నిజాంసాగర్, జూరాల ప్రాజెక్ట్‌లకు వరద ఉధృతి
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:19 AM
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
నిజామాబాద్, జులై 29: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లోకి వరద పెరుగుతోంది. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్ట్‌లోకి 6585 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులు, 7.139 టీఎంసీలుగా నమోదు అయ్యింది. గత సంవత్సరం ఇదే రోజు ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 1391.25 అడుగులు, 4.597 టీఎంసీలుగా ఉన్న విషయం తెలిసిందే.
జూరాలకు వరద ప్రవాహం..
అటు మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 27,000 క్యూసెక్కులు, ఔవుట్ ఫ్లో 28000 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 317.240 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.17 టీఎంసీలుగా నమోదు అయ్యింది. వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
కామారెడ్డిలో మహిళను బురిడీ కొట్టించిన దొంగలు
Read Latest Telangana News And Telugu News