కామారెడ్డిలో మహిళను బురిడీ కొట్టించిన దొంగలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:08 AM
కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఓ మహిళను దొంగలు మోసం చేసి నగదు కాజేశారు.
కామారెడ్డి జిల్లా, జులై 29 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఓ మహిళను దొంగలు మోసం చేసి నగదు కాజేశారు. డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు, మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను చాకచక్యంగా మాయం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ బ్యాంకు పనుల నిమిత్తం కామారెడ్డిలోని ఎస్‌బీఐ శాఖకు వెళ్లింది. బ్యాంకులో నగదు లెక్కపెడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను గమనించారు. అనంతరం ఆమె వద్దకు వెళ్లి డబ్బులను సరిగ్గా లెక్కపెడతామని, నోట్లను పరిశీలిస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన పూజ తన వద్ద ఉన్న నగదును వారికి ఇచ్చింది. ఈ క్రమంలో దుండగులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి, నోట్ల కట్టలో నుంచి రూ.15 వేల నగదును తీసేశారు.
అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన బాధితురాలు మోసపోయానని గ్రహించింది. ఆమె ఫిర్యాదు మేరకు బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు నిర్వహించే సమయంలో అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని బాధితురాలికి పోలీసులు ధైర్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి
ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News