చకచకా ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-02-22T02:13:30+05:30 IST
జిల్లాలో శాసనమండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను యంత్రాంగం చకచకా చేస్తోంది. వచ్చేనెల 13న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సామగ్రి. సిబ్బంది సిద్ధం
చిత్తూరు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో చర్యలు వివరించిన ఇన్‌చార్జి కలెక్టర్
రేపటితో ముగియనున్న నామినేషన్లు
ఒంగోలు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శాసనమండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను యంత్రాంగం చకచకా చేస్తోంది. వచ్చేనెల 13న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఎన్నికల సంఘం ఆదేశాలతో దాదాపు మూడు నెలల ముందు నుంచే ఇందుకు సంబంధించిన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అయితే ఈనెల 17న నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కావడంతో ఆ ఏర్పాట్లపై మరింత దృష్టిసారించారు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉండగా చిత్తూరు కలెక్టర్ హరినారయణన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల దాఖలు కూడా చిత్తూరు కలెక్టర్ వద్దనే జరుగుతుండగా ఇతర అన్ని ఏర్పాట్లను రిటర్నింగ్ అఽధికారి హోదాలో ఆయన పర్యవేక్షిస్తున్నారు.
చిత్తూరు కలెక్టర్ సమీక్ష
నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23తో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ బాక్సులు ఇతర మెటీరియల్ తదితర అంశాలపై దృష్టిసారించారు. అందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారైన చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కీలక అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేశారు. జిల్లా నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డీఆర్వో ఓబులేసు, ఆర్డీవోలు విశ్వేశ్వరరావు, సందీప్, డిప్యూటీ కలెక్టర్లు సరళావందనం, గ్లోరియా, ఎం.శ్రీదేవి, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను ఇన్‌చార్జి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి వివరించారు. జిల్లాలో 82,189మంది గ్రాడ్యుయేట్, 5,712 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా గ్రాడ్యుయేట్ల కోసం 98, ఉపాధ్యాయుల కోసం 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, మరొక ఏపీవోతోపాటు మరో 500 మంది సిబ్బందిని నియమించారు.