నాన్న కలను గెలిపించింది
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:59 AM
బాడీబిల్డర్‌గా నాన్న సాధించలేనిది కూతురు నెరవేర్చింది. దేశానికి పతకం తేవాలన్న ఆయన కలను తనదిగా చేసుకొని... గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో...
విజేత
బాడీబిల్డర్‌గా నాన్న సాధించలేనిది కూతురు నెరవేర్చింది. దేశానికి పతకం తేవాలన్న ఆయన కలను తనదిగా చేసుకొని... గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం గెలుచుకుంది. నెలసరి సవాళ్లను అధిగమించి... దృఢ సంకల్పంతో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పోడియంపై మువ్వన్నెల పతాక ధరించి...
భారత్‌కు మరొక పతకాన్ని అందించిన ఎలక్ర్టీషియన్ కూతురు జ్ఞానేశ్వరీ యాదవ్ కథ ఇది.
దాదాపు పాతికేళ్ల క్రితం... ఛత్తీ్‌సఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో దీపక్ యాదవ్ పేరు తెలియనివారు లేరు. అప్పుడు ఆయన ప్రముఖ బాడీబిల్డర్. తరచూ స్థానిక బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ఎలక్ర్టీషియన్‌గా పని చేసే ఆయన ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కన్నారు. కానీ ఇల్లు, పిల్లలు... కుటుంబ అవసరాలు పెరిగిపోవడంతో ఆయన ప్రాధాన్యతలు మారిపోయాయి. కెరీర్‌ను, కలలను పక్కనపెట్టక తప్పలేదు. కానీ ఆ క్షణమే తన కుమార్తెను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. పదమూడేళ్ల వయసులో కూతుర్ని స్థానిక వ్యాయామశాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు పవర్‌లిఫ్టింగ్ పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే కూతురు సామర్థ్యాన్ని గుర్తించిన దీపక్... పవర్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే నేడు దేశం గర్వించే వెయిట్‌లిఫ్టర్‌ను అందించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రజత పతకం తెచ్చి పెట్టింది. నాన్న కలను తనదిగా చేసుకొని... అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్న జ్ఞానేశ్వరీ యాదవ్ ప్రయాణంలో అద్భుత విజయాలు ఎన్నో ఉన్నాయి.
నాన్న కలను తనదిగా...
రాజ్‌నంద్‌గావ్ జిల్లా భోదియా గ్రామంలో పుట్టి పెరిగిన జ్ఞానేశ్వరిని ఆమె తండ్రి... వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ అయిన అజయ్ లోహర్ విశ్వకర్మకు పరిచయం చేశారు. వ్యాయామశాలలోనే ఒక గదిలో అజయ్ పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు. ఆరంభంలోనే జ్ఞానేశ్వరి ప్రతిభను గుర్తించిన ఆయన... మరింత ప్రోత్సహించారు. ‘మొదటిరోజే జ్ఞానేశ్వరి పది కిలోల చెక్క పలకను సునాయాసంగా ఎత్తింది. తను మంచి వెయిట్‌లిఫ్టర్ అవుతుందని నాకు అప్పుడే అనిపించింది. సహజసిద్ధమైన బ్యాలెన్స్, శారీరక దారుఢ్యం ఉండటంవల్ల ప్రాథమిక అంశాలను చాలా త్వరగా నేర్చుకోగలిగింది’ అంటూ చెప్పుకొచ్చారు అజయ్. చిన్న వయసులోనే నాన్న మనసును అర్థం చేసుకున్న జ్ఞానేశ్వరి పట్టుదలగా సాధన చేసింది.
అలుపెరుగని ప్రయత్నం...
‘జ్ఞానేశ్వరి చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణతో క్రీడను అభ్యసించింది. వర్షం పడుతున్నా, ఎండ తీవ్రంగా ఉన్నా, మరే కారణంగానూ జిమ్‌కు వెళ్లడం మానలేదు. శిక్షణకు విరామం ఇవ్వలేదు. అనుకున్నది సాధించేవరకు పట్టు వదిలేది కాదు’ అంటారు దీపక్. స్థానిక వ్యాయామశాలలో ఆమె ప్రయాణం మొదలైంది. ఆ తరువాత జాతీయ స్కూల్ గేమ్స్‌లో, రాష్ట్ర చాంపియన్‌షి్‌పలలో పతకాలు సాధించి తానేంటో నిరూపించుకుంది. 2020 ఖేలో ఇండియా క్రీడల్లో టైటిళ్లు గెలుచుకుంది. జాతీయ జూనియర్ కిరీటాన్ని దక్కించుకుంది. కొవిడ్ సమయంలోనూ ఆమె ప్రయత్నం ఆగలేదు. ఆరేడు నెలలపాటు జిమ్‌లు మూతపడినా, ఇంట్లోనే శిక్షణ కొనసాగించింది. గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మలతో సాధన చేసింది. మూడేళ్ల కిందట కామన్వెల్త్ చాంపియన్‌షి్‌ప 49 కేజీలో కేటగిరీలో విజేతగా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మొదటిసారి పోటీపడి... ఐదో స్థానంలో నిలిచిన ఆమె... అనంతరం జాతీయ క్రీడల్లో సత్తా చాటి తొలి పకతాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప 53 కేజీల విభాగంలో 194 కేజీలు లిఫ్ట్ చేసి కాంస్య పతకం నెగ్గింది. పోటీపడిన ప్రతిచోటా సత్తా చాటుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టార్.

ఆమె విజయాల స్ఫూర్తితో...
జ్ఞానేశ్వరి సాధించిన విజయాలు తన సొంత గ్రామంలో క్రీడాస్ఫూర్తి రగిలించాయి. వర్ధమాన క్రీడాకారులకు ప్రయోజనాలు కల్పించాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆమె గెలిచిన పతకాలవల్ల జిల్లా యంత్రాంగం వెయిట్‌లిఫ్టింగ్ కోసం స్థానిక స్టేడియంలో స్థలం కేటాయించింది. శిక్షణకై పరికరాలను సమకూర్చింది. జ్ఞానేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఇది ఆమెకు, ఆమె కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ‘నా కూతురు ఇక్కడ శిక్షణ తీసుకునే సమయంలో రోజూ చికెన్, జ్యూస్ తెచ్చి ఇచ్చేవాడిని. వాటిని తెలిసిన దుకాణంలో అరువుకు తెచ్చేవాడిని. చేతికి డబ్బు వచ్చినప్పుడు చెల్లిస్తానని దుకాణదారుడితో ముందే ఒప్పందం చేసుకున్నాను’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు దీపక్. ఇంట్లో అమ్మ దుర్గ చేసే పప్పు అన్నం, చట్నీ అంటే జ్ఞానేశ్వరికి చాలా ఇష్టం. ఎప్పుడు ఇంటికి వచ్చినా అవి వండించుకొని తింటుంది.
అద్భుత విజయం...
ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదలతో అంచలంచెలుగా ఎదుగుతూ కెరీర్‌ను పరుగులు పెట్టించింది జ్ఞానేశ్వరి. కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మీరాబాయిచాను లాంటి దిగ్గజ వెయిట్‌లిఫ్టర్లతో కలిసి ప్రయాణించే అవకాశం దక్కింది. వారి సూచనలు, సలహాలతో మరింత ఉత్సాహంగా బరిలోకి దిగిన జ్ఞానేశ్వరి సోమవారం 53 కేజీల విభాగంలో 199 కిలోల బరువు ఎత్తి రజత పతకం నెగ్గింది. స్నాచ్‌లో 88 కిలోల అత్యుత్తమ లిఫ్ట్‌ను నమోదు చేయగా, తరువాత క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోల బరువు ఎత్తి పతకం ఖాయం చేసుకుంది. తృటిలో స్వర్ణం చేజారినా, కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొన్న ఆమె భారత్ పతకాల పట్టికకు మరో పతకం జోడించింది.
శారీరక సవాళ్లను దాటి...
కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలిచిన జ్ఞానేశ్వరి భావోద్వేగానికి లోనైంది. ‘‘ఎంతో ఆనందంగా ఉంది. ఇదే నా మొదటి కామన్వెల్త్ గేమ్స్. పోటీలకు ముందు ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాను... నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని. సరిగ్గా అదే చేశాను. వాస్తవానికి భారత్‌కు స్వర్ణపతకం అందివ్వాలని ప్రయత్నించాను. కానీ తీవ్రమైన పోటీ ఎదురైంది. ఈ రోజు నాకు నెలసరి మొదటి రోజు. నా శరీరం ఎలా స్పందిస్తుందో, అనుకున్న విధంగా ప్రదర్శన ఇవ్వగలనో లేదో కూడా తెలియదు. అయినా శక్తినంతటినీ ఒడ్డి ప్రయత్నించాను. నా పోరాటం వృథా అవ్వలేదు’’ అంటూ అంతిమ సమరం అనంతరం ఆమె వెల్లడించింది. శారీరకంగా సవాళ్లు ఎదురైనా దృఢ చిత్తంతో పోరాడిన జ్ఞానేశ్వరి విజయం... నేటి తరానికి స్ఫూర్తి మంత్రం.
ఈ వార్తలు కూడా చదవండి..
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
For More National News And Telugu News