సిగ్గుతో తల దించుకుంటున్నా.. క్షమించండి
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:35 AM
‘ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు నేరెళ్లలో జరిగిన దాష్టీకం.. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన.. అప్పుడు పాలించిన కుటుంబంలోని సభ్యురాలిగా సిగ్గుతో తల దించుకుంటూ క్షమాపణ అడుగుతున్నా’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు..
నేరెళ్ల దాష్టీకం జరిగినప్పుడు అధికారంలో ఉన్న కుటుంబ సభ్యురాలిగా క్షమాపణ అడుగుతున్నా
బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల (ఆంధ్రజ్యోతి): ‘ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు నేరెళ్లలో జరిగిన దాష్టీకం.. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన.. అప్పుడు పాలించిన కుటుంబంలోని సభ్యురాలిగా సిగ్గుతో తల దించుకుంటూ క్షమాపణ అడుగుతున్నా’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సర్కారు మెడలు వంచి నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి సంఘటనలు జరగబోవని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి చనిపోగా, గ్రామస్తులు ఆ లారీని తగలబెట్టారు. ఈ మేరకు పోలీసులు 8 మందిని అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని మంగళవారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు బాధలో ఉంటే ఆదుకోని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటనకు కారణమైన పోలీసులు, బడాబాబులకు ఎందుకు శిక్షలు పడలేదని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్‌ను నిలదీశారు.
బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని భరోసా ఇచ్చారు. ఎస్సీ కమిషన్ రిపోర్టును తీసుకొస్తామని, అవసరమైతే సీఎంవో, అసెంబ్లీ ఎదుట బైఠాయించి నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల బాధితుల మీద దాష్టీకానికి పాల్పడిన ఎస్పీపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చెప్పిందని, ఒక ఎస్సైని బలి చేసి.. మిగతా వాళ్లను వదిలిపెట్టేశారని ఆరోపించారు. నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అప్పటి స్పీకర్ మీరా కుమార్‌ను తీసుకొచ్చి బాధితులకు హామీలు ఇచ్చిన పొన్నం ప్రభాకర్, భట్టి, అడ్లూరి లక్ష్మణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేరెళ్ల బాధితులకు జరిగిన అవమానంపై పోరాటం చేయాల్సిందేనని, అన్ని పార్టీలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ సైతం బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, వాళ్ల పిల్లల చదువుల ఖర్చు భరించాలని కోరారు.