Share News

పట్నంలో ఉద్యోగాలు తక్కువ.. జీతం ఎక్కువ

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:21 AM

తెలంగాణలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్ఎస్)లో తేలింది.

పట్నంలో ఉద్యోగాలు తక్కువ.. జీతం ఎక్కువ
Telangana Jobs Report 2026

  • మహిళలకు ఉపాధి కష్టాలు..

  • పనికి సిద్ధంగా ఉన్నా ప్రతి ముగ్గురిలో ఒక్కరికే పని

  • పల్లెల్లో సాగు, అనుబంధ రంగాలతో ఉపాధి అవకాశాలు మెండు.. జీతమే తక్కువ

  • గ్రామాల్లో 65.2 శాతం మందికి పని.. పట్టణాల్లో 54.5 శాతం మాత్రమే..

  • గ్రామీణ మహిళల స్వయం ఉపాధి వాటా 61.9 శాతం..

  • పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్ఎస్)లో తేలింది. గ్రామాల్లో 65.2 శాతం కార్మిక భాగస్వామ్యం ఉండగా, పట్టణాల్లో 54.5 శాతమే ఉంది. నగరాల్లో ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వాటిని అందిపుచ్చుకునే వారి సంఖ్య పరిమితంగానే ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, స్వయం ఉపాధి ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.


అయితే, పట్టణాల్లో ఉద్యోగాలు తక్కువగా ఉంటున్నా వేతనాలు ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలో గుర్తించారు. పల్లెల్లో ఉపాధి దొరుకుతున్నా జీతం మాత్రం తక్కువగా ఉంటోంది. అయితే, మహిళలకు ఆశించినస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉండడంలేదు. పనిచేయాలనే ఆసక్తి ఉండి, అందుకు సిద్ధంగా ఉన్న మహిళలందరికీ పని లభించడంలేదు. ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సర్వేలో తేలింది. నగరాల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒక్కరికే పని దొరుకుతోంది. అంటే ప్రతీ 100 మందిలో 30-32 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటున్నాయని పీఎల్‌ఎ్‌ఫఎస్‌ వెల్లడించింది. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న జనాభాను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వేలో 2026 జూలై-సెప్టెంబరు త్రైమాసిక గణాంకాల ప్రకారం తెలంగాణలో పనిచేయాలన్న ఆసక్తి, సిద్ధంగా ఉన్నవారి భాగస్వామ్య రేటు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేటు) 60.3 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 65.2 శాతం, పట్టణాల్లో 54.5 శాతం ఉంది.


  • పనిచేస్తున్న వారి నిష్పత్తి (వర్కర్‌ పాపులేషన్‌ రేషియో- డబ్ల్యూపీఆర్‌) రాష్ట్రవ్యాప్తంగా 56.4 శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 62.5 శాతం, పట్టణాల్లో 49.2 శాతం మంది పని చేస్తున్నారని తేలింది.

  • గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 63.4 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ వాటా కేవలం 4.7 శాతమే. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నవారు 40.1 శాతం ఉన్నారు.

  • పట్టణ ప్రాంతాల్లో సేవారంగంలో అత్యధికంగా 67.4శాతంమంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాటా 18.2 శాతమే. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలో ఉపాధి పొందుతున్న వారు 37.7 శాతం.

  • పరిశ్రమలు, తయారీ, నిర్మాణం తదితరాలతో కూడిన ద్వితీయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం, పట్టణ ప్రాంతాల్లో 27.9 శాతం మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ వాటా 22.2 శాతంగా ఉంది.


  • రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగ రేటు 6.4 శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 9.6 శాతం నిరుద్యోగిత ఉంది.

  • గ్రామీణ తెలంగాణలో 56 శాతం మంది మహిళలు కార్మిక శక్తిలో భాగస్వాములవుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో 32 శాతమే ఉన్నారు. పల్లెల్లో ప్రతి 100 మంది మహిళల్లో 56 మంది పనిచేస్తున్నారు లేదా పని కోసం ప్రయత్నిస్తున్నారు. నగరాల్లో ఈ సంఖ్య 32 మాత్రమే ఉంది. పట్టణ మహిళల వర్కర్‌ పాపులేషన్‌ రేషియో (డబ్ల్యూపీఆర్‌) 26శాతంగా ఉంది.అంటే ప్రతి100 మంది మహిళల్లో వాస్తవంగా ఉద్యోగాలు చేస్తున్నవారు 26 మంది మాత్రమే. ఈ విషయంలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్‌ 31.3 శాతంతో మొదటి స్థానంలో ఉంది.

  • గ్రామీణ మహిళల్లో స్వయం ఉపాధిపై ఆధారపడినవారు 2023-24 నాటికి 61.9 శాతం ఉన్నారు. పట్టణ మహిళలకు ఉద్యోగాలు లభించకపోవడానికి నైపుణ్యాలు, ఉద్యోగ అవసరాల మధ్య అంతరం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:22 AM