మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:26 AM
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీని పథకాన్ని ప్రారంభించనుంది.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల(BC) మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బీసీ కులాలకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా, వారికి సొంతంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సాధారణ మిషన్లే కాకుండా, ఆధునిక సాంకేతికతతో కూడిన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనుంది ప్రభుత్వం.
నియోజకవర్గానికి 1,000 మిషన్లు..
తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టు మిషన్లను కేటాయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం అమలు చేస్తోంది. కుట్టుపనిలో ఇప్పటికే నైపుణ్యం కలిగి ఉండి, సరైన యంత్రాలు లేక ఇబ్బంది పడుతున్న బీసీ మహిళలకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పించనుంది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ద్వారా పని వేగంగా, నాణ్యతగా జరుగుతుంది. సాధారణ మిషన్లతో పోలిస్తే వీటి ద్వారా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుపేద మహిళలు దర్జీలుగా మారి తమ కుటుంబాన్ని పోషించుకోగలరని ప్రభుత్వం భావిస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ, మార్గదర్శకాలు..
ఈ పథకానికి సంబంధించి అర్హతలు, వయసు పరిమితి, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక మార్గదర్శకాలను(Guidelines) విడుదల చేయనుంది. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. వార్షిక ఆదాయ పరిమితి వంటి నిబంధనలు ఉండే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News