నాంపల్లి అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వివరణ
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:52 PM
నాంపల్లి భారీ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. అగ్ని ప్రమాద సంబంధిత కారణాలను మీడియాకు వెల్లడించారాయన.
హైదరాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి(Nampally)లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. మీడియా వేదికగా ప్రమాద సంబంధిత ఘటనా వివరాలను ఆయన వెల్లడించారు. నాలుగంతస్తుల భవనంలోని ఓ ప్రముఖ ఫర్నిచర్ షోరూమ్‌లో మంటలు వ్యాపించగా.. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
షార్ట్ సర్క్యూట్ కారణం..
జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. భవనం కింద రెండు సెల్లార్లు ఉన్నాయని ఆయన వివరించారు. మొదటి సెల్లార్‌లో ఫర్నిచర్‌కు సంబంధించిన మెటీరియల్స్ డంప్ చేశారన్నారు. అలా డంప్ చేయడం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడిందని ఆయన చెప్పారు. ఇందులో పనిచేసే కార్మికులు కూడా రెండో సెల్లార్‌లో ఉన్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో సెల్లార్లకు పర్మిషన్ లేదని స్పష్టం చేసిన ఆయన.. ఈ ఘటనకు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోందన్నారు.
సెల్లార్‌లో ఐదుగురు..
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ డీజీ తెలిపారు. కానీ దట్టమైన పొగల కారణంగా సెల్లార్‌లోకి వెళ్లేందుకు మరో రెండు గంటల సమయం పట్టొచ్చన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. సెల్లార్‌లో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పురుషులు సహా ఓ మహిళ లోపల ఉన్నారని చెప్పారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చామని, యజమానిపై చర్యలు తీసుకుంటామని విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News