తెలంగాణ ఈ-గవర్నెన్స్‌పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై కేంద్రం దృష్టి
ABN , Publish Date - May 18 , 2026 | 06:16 PM
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ విషయంపై మాట్లాడారు.
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు (K. Ramakrishna Rao) ఈ విషయంపై మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. మున్సిపల్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, రెవెన్యూ వంటి కీలక శాఖల్లో ఆన్‌లైన్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ (TV Somanathan) ఈరోజు (సోమవారం) సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. ఈ డ్యాష్‌బోర్డుల ద్వారా పౌరసేవల్లో పారదర్శకత పెరిగిందని, ఫిర్యాదుల పరిష్కారం కూడా వేగవంతమైందని పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం లేకుండా ఈ-గవర్నెన్స్ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి ప్రతి పౌరుడికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.
డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు: టీవీ సోమనాథన్
ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ‘సింపుల్ ఈ-గవర్నెన్స్’ విధానాన్ని బలోపేతం చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఆయా రాష్ట్రాలకు సూచించారు. డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తమిళనాడు అమలు చేస్తున్న ‘simplegov’ మోడల్‌ను అధ్యయనం చేసి, ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనలో రాష్ట్రాల పాత్ర కీలకమని టీవీ సోమనాథన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
Read Latest Telangana News And AP News And International News And Telugu News