సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం
ABN , Publish Date - May 17 , 2026 | 02:28 PM
సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): సర్ (SIR)పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు. ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఒక్కొక్కరి ఓటు పది ప్రాంతాల్లో చూపిస్తోందని తెలిపారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో సర్ షెడ్యూల్ వచ్చిందని ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని తాము తప్పుపట్టడం లేదని అన్నారు. ఓటర్ లిస్టు సరిదిద్దడంలో అందరి బాధ్యత ఉందని తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్కో ఇంటికి మూడుసార్లు వెళ్తారని చెప్పారు.
ఉద్యోగులపై నమ్మకం లేదు..
రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ముస్లింల మీటింగ్‌కి వెళ్లి.. మీరంతా ముందుకు రావాలని సీఎంగా ఉండి రేవంత్‌రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సర్ చేసేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని.. బీజేపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. సర్‌లో కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సర్‌లో ఎక్కడ కుట్ర జరుగుతుందో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహించారు. కేరళం, తమిళనాడులో బీజేపీ గెలవలేదు కాబట్టి అక్కడ సర్ బాగా జరిగిందని అంటున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ సర్ తప్పు జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి..
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని... ఎలక్షన్ కమిషన్‌పై బురద జల్లవద్దని కిషన్‌రెడ్డి హితవు పలికారు. సర్ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందని ప్రస్తావించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉంటే... ఒక్కొక్కరిని వెతికి తొలగించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. విదేశీయులను తొలగిస్తే రాహుల్‌గాంధీకి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లో సర్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉందని.. కేంద్ర సిబ్బంది కాదని తేల్చిచెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్థాయికి తాను దిగజారనని అన్నారు. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందా..? అని ప్రశ్నించారు మాజీమంత్రి కేటీఆర్ రెండుసార్లు గెలిచి మంత్రి అయితే అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ మంచిదా..? అని నిలదీశారు. ప్రజలు చాలా తెలివైనవాళ్లని చెప్పారు. సర్‌నీ రాహుల్‌గాంధీ వ్యతిరేకించిన.. తెలంగాణలో వాళ్లే పూర్తి చేస్తారని తెలిపారు.
రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోంది..
రెండున్నరేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల విషయంలో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. రైతులకు అరకొర రుణమాఫీ.. లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం అండగా ఉన్న... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోందని ప్రశ్నించారు. MSPని కేంద్రం పెంచిన.. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎదురు దాడిపై దృష్టి పెడుతున్నారు తప్ప.. ఎందుకు ఆయా పంటలు కొనుగోలు చేయడం లేదో చెప్పట్లేదని ప్రశ్నించారు.
సన్నవడ్లకు బోనస్ ఏది..?
రూ.500 బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ పూర్తిగా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ధాన్యం కొనుగోలులో ప్రతి పైసా కేంద్రం ఇస్తోందని స్పష్టం చేశారు. అన్నదాతకు కావాల్సిన ప్రతి వస్తువును కేంద్రప్రభుత్వమే ఇస్తోందని తేల్చిచెప్పారు. అనేక విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. వాళ్ల చేతకానీ తనం.. వాళ్ల వైఫల్యం ఇతరుల మీద రుద్ది.. వాళ్లు హీరోలం అవుదామని అనుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన
Read Latest Telangana News And AP News And International News And Telugu News