నాలుగో రోజు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు చర్చించే అంశాలివే..
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:37 AM
శాసనసభలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా, వేతన సవరణ కమిషన్ ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
హైదరాబాద్: రంజాన్ పండుగ వేళ రెండ్రోజుల విరామం తర్వాత ఉభయ సభలు ఇవాళ(సోమవారం) పునఃప్రారంభం కానున్నాయి. నేటితో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి(Telangana Legislative Council) సమావేశాలు మెుదలు కానున్నాయి. ఉభయసభల్లో నేడు క్వశ్చన్ అవర్ (Question Hour) నిర్వహించనున్నారు.
శాసనసభలో చర్చించే అంశాలు..
అసెంబ్లీలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా, వేతన సవరణ కమిషన్ ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కోల్గం సఫారీ, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో యూరియా కొరత, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు.
శాసనమండలిలో ప్రశ్నలివే..
ఇక, శాసనమండలిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల ఏర్పాటు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, గ్రామ పాలన అధికారులు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, ఐటీ ఉద్యోగాల కల్పన వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అదనంగా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదోన్నతులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం, హైదరాబాద్ నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టనున్నారు.
రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రులు..
మరోవైపు శాసనసభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. 2026 తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు. అలాగే 2026 తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌లో నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది వేతన హేతుబద్ధీకరణ మూడో సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయసభల్లో 2026-27 వార్షిక బడ్జెట్‌పై మొదటి రోజు సాధారణ చర్చను సభ్యులు కొనసాగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం