వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:39 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యకుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.
చిరువ్యాపారి మీద బండ
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
ఇప్పటికే పదిశాతం హోటళ్లు మూసివేత
ఇలానే కొనసాగితే త్వరలో మరో ఇరవై శాతం
రేట్లు పెంచేసిన నిర్వాహకులు.. మరికొన్ని వంటకాల తయారీ నిలుపుదల
బ్లాక్ మార్కెటు నిలువరించాలని హోటల్ యజమానుల విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ నెట్‌వర్క్ మార్చి 22 (ఆంధ్ర జ్యోతి): గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో ఇప్పటికి వారాసిగూడలో ఒక చిరుతిండి తయారీ కేంద్రం, ఎల్బీనగర్‌లో భాగ్యనగర్ బిర్యానీ పాయింట్, మన్సూరాబాద్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, రాంనగర్ మురుగన్ టిఫిన్స్ మణికొండలోని ఓ పలావ్ హోటల్, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చందానగర్‌లో ఇడ్లి బండి.. ఇలా చాలానే మూతపడ్డాయి. ఇవే కాకుండా చంపాపేట, యూసఫ్ గూడ, బడంగ్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్పీ తదితర ప్రాంతాల్లో కొన్ని కర్రీపాయింట్లు క్లోజ్ అయ్యాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో 'ఆంధ్రజ్యోతి' పరిశీలనలో ఆసక్తికర విషయాలు, చిరు వ్యాపారుల కష్టాలు వెలుగులోకి వచ్చాయి.
అక్కడ యుద్ధం.. ఇక్కడ కష్టం..
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యకుడు వెంకటరెడ్డి చెబుతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ లోటు వల్ల పది రోజుల్లో నగరంలో సుమారు 7 నుంచి 10శాతం చిన్నాచితక టిపిన్ సెంటర్లు, చిరుతిండ్ల తయారీ కేంద్రాలు మూతపడినట్లు 'ఆంధ్రజ్యోతి' క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే అది 20 నుంచి 25 శాతానికి కూడా పెరగచ్చని అంటున్నారు.
మెనూలో కోత...
చాలా హోటళ్లు టిఫిన్ సెంటర్లలో మెనూలో కోత పెట్టాయి. గ్యాస్ కొరతతో కొన్ని టిఫిన్ సెంటర్లలో పూరి, సాంబారు, చపాతీ, వడ, వెజిటెబుల్ బిర్యానీ, బెసిబె లాబాత్ వంటి పదార్థాలు వండడం లేదు. పాతనగరంలో నయాబ్ హోటల్లో పాయా షేర్వా సాగరీ, చైనీస్ వంటకాలు ఇతర వేపుళ్ల తయారీ ఆపేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఇదివరకు రెండు పూటలా అల్పాహార హోటల్ నిర్వహించే వారు సాయంత్రం బజ్జీలు, బోండాలు వంటి వాటికే పరిమితమయ్యారు. మరికొందరు ఆహారపదార్థాల పరిమాణాన్ని తగ్గించారు.
ఇలా అయితే నడపలేం..
'యుద్ధానికి ముందు రూ.1800 దొరికే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.4వేల నుంచి రూ.7వేలకు దొరుకుతోంది. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికే మొదట సరఫరా చేస్తున్నారు. ఇదివరకు క్వింటా కట్టెలు రూ.800 అయితే ఇప్పుడు అవీ రెట్టింపు అయ్యాయి. బొగ్గులు ధర కూడా బాగా పెంచారు, ఇలా అయితే మరో పదిరోజులకు మించి హోటల్ నడపలేను. గ్యాస్ దొరక్కపోతే మాత్రం టిఫిన్ సెంటర్ మూయడమే." సంతోశ్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, జీడిమెట్ల
ఖాళీస్థలాల వెతుకులాట..
చాలా వరకు హోటల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. మూసాపేటలోని అమృత్ విలాస్ హోటల్లో కట్టెలపొయ్యికి ప్రత్యేకంగా గాడికూడా నిర్మించారు. బ్లోయర్ వుడ్ స్టవ్ ధర రూ.20వేల నుంచి రూ.50వేలు పలుకుతున్నా కొనుగోలు చేస్తున్నారు. కొందరు కట్టెల పొయ్యి ఏర్పాటుకు హోటల్‌కు దగ్గరలో ఖాళీ స్థలాల కోసం వెతుకుతున్నారు. నిరుపయోగ జాగాలకూ అద్దె అధికమొత్తంలోనే చెల్లించాల్సి వస్తోందని అత్తాపూర్‌లోని ఓ హోటల్ యజమాని వెల్లడించారు.
కొందరు డొమెస్టిక్‌తోనే..
నగరంలోని పలు హోటళ్లు వంటకు డొమెస్టిక్ సిలిండర్లను సైతం బహిరంగంగా వినియోగిస్తున్నారు. తనిఖీలకు భయపడి మరికొందరు మాత్రం డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్‌ను ప్రత్యేక పైప్ ద్వారా కమర్షియల్ సిలిండర్‌లోకి మారుస్తున్నారు. కొందరు ట్యూబ్ విక్రయాలను గుట్టుగా రూ.500 అమ్ముతున్నట్లు సమాచారం.
పెరిగిన ధరలు...
నగరంలోని 80శాతానికి పైగా టిఫిన్ సెంటర్లలో ప్రతి ఆహారపదార్థంపై రూ.15 పెంచారు. గ్యాస్ కొరత కారణంగా అధిక ధరలను వెచ్చించి సిలిండర్లను కొనుగోలు చేస్తుండడంతో కొన్ని హోటళ్ల క్యాష్ కౌంటర్, ప్రవేశ ద్వారాల వద్ద పోస్టర్లను సైతం అంటించారు. రూ.10 ఉన్న టీ ధరను రూ.15, రూ.30 ఉన్న ప్లేటు ఇడ్లీ ధరను రూ.40కు పెంచేశారు. భోజనం మీద రూ.20 నుంచి రూ.40, కూరల మీద రూ.5 నుంచి రూ.10ధర పెంచారు.. మరికొందరు దీన్ని సాకుగా చూపుతూ రూ.100 చికెన్ బిర్యానీ ధర కూడా 30 నుంచి 50 రూపాయలు పెంచారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పెంచిన ధరలు తగ్గిస్తారా? అని కూడా కొందరు అడుగుతున్నారు.
పడిపోయిన ఫుడ్ డెలివరీలు..
గ్యాస్ సంక్షోభంతో చాలా హోటల్స్ మెనూలకు కోత విధించడం, మూసేయడంతో ఫుడ్ డెలివరీలు కూడా గణనీయంగా పడిపోయాయని ఆయా యాప్‌ల డెలివరీ భాగస్వాములు చెబుతున్నారు. రోజుకు 25 నుంచి 30 ఫుడ్ ఆర్డర్లను డెలివరీలు చేసే బాయ్ ప్రస్తుతం 4 నుంచి 5 డెలివరీలు చేయడమే గగనంగా మారిందంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డ్రైవింగ్ లైసెన్సుకి ఇకపై 3 పరీక్షలు!
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు