Share News

హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్

ABN , Publish Date - Mar 23 , 2026 | 08:19 AM

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ ఎంఐకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. అది తీవ్ర చర్చనీయాంశం అయింది. నాటి నుంచి నేటి వరకు ఆ వివాదం సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


‘దేశానికి రెండు ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ ఉన్న జట్టుకు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌ చేయడం విచిత్రంగానే ఉంది. జట్టు మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు కలిసి భవిష్యత్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ కెప్టెన్సీ వివాదం సద్దుమణిగిందని అనుకోవడానికి లేదు. అయితే హార్దిక్ తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ‘నాకు కెప్టెన్సీ వద్దు.. సూర్యనే ఎంఐకి నాయకత్వం వహించాలి’ అని స్వయంగా అతడే చెప్పాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి’ అని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.


రోహిత్ శర్మ నాయకత్వంలో 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత జట్టుకు ట్రోఫీ అందలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి హైప్రొఫైల్ ట్రేడ్ ద్వారా ఎంఐకు వచ్చిన హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ నిర్ణయం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ సీజన్‌లో జట్టు తుది స్థానంలో నిలవడం విమర్శలకు తావిచ్చింది. 2025లో ప్లే ఆఫ్స్‌కు చేరినా టైటిల్ సాధించలేకపోవడంతో కెప్టెన్సీపై మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌కు విజయం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉండటం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 09:06 AM