ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:34 PM
పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి 26న ప్రారంభం కానున్న ఈ లీగ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన కొరత ప్రభావంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి 26న ప్రారంభం కానున్న ఈ లీగ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
పీఎస్ఎల్‌లో అన్నీ మ్యాచ్‌లు కేవలం లాహోర్, కరాచీ నగరాల్లోనే జరుగనున్నాయి. ప్రారంభ వేడుకను కూడా రద్దు చేశారు. పరిస్థితులు మెరుగుపడితే చివరి దశలో ప్రేక్షకులను అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామని నఖ్వీ తెలిపారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని నఖ్వీ చెప్పారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రజలు ప్రయాణాలను తగ్గించాలని, పాఠశాలలు మూసివేసి ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
‘ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు బాలేవు. యుద్ధం కారణంగా చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు ప్రయాణాలు తగ్గించమని చెబుతూ.. మరోవైపు వేలాది మంది స్టేడియాలకు వచ్చి క్రికెట్ మ్యాచ్‌లు చూడాలని చెప్పడం సరైంది కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆదాయం కోల్పోయిన ఫ్రాంచైజీలకు నష్టపరిహారం అందజేస్తాం. మరీ ముఖ్యంగా తొలిసారిగా పీఎస్‌ఎల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన పెషావర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నఖ్వీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా
ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్