ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్
ABN , Publish Date - Mar 22 , 2026 | 02:22 PM
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి చెప్పాడు. కొవిడ్ కారణంగా ఆ సీజన్‌లో కట్టుదిట్టమైన బయోబబుల్ మధ్య కొన్ని మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఇద్దరు ప్లేయర్లకు కొవిడ్ పాజిటివ్ తేలడంతో లీగ్‌ను ఐపీఎల్ నిర్వాహకులు వాయిదా వేశారు. ఉన్నట్టుండి టోర్నీనే వాయిదా పడటానికి వరుణ్ చక్రవర్తినే కారణమంటూ అప్పట్లో సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు కురిపించారు.
ఆటలో భాగంగా గాయపడి తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతూ స్కానింగ్ కోసం బయోబబుల్ దాటి వెళ్లడంతో వరుణ్ చక్రవర్తికి కొవిడ్ సోకింది. అతడితోపాటు సందీప్ వారియర్‌కూ వచ్చింది. దీంతో ఆ తర్వాతి మ్యాచ్‌లన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను వరుణ్ గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వింకా చచ్చిపోలేదా’ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లపై మాట్లాడాడు.
‘నా ఐపీఎల్ కెరీర్‌లో 2021 సీజన్ అత్యంత దారుణమైంది. నాకు కొవిడ్ రావడం వల్ల లీగ్‌ను మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. పాజిటివ్ వచ్చిన తొలి ఆటగాడిని నేనే. దీంతో బయట నుంచి అభిమానులు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన లీగ్ ఆగిపోవడంతో వారికి కోపమొచ్చింది. ఇంకా బతికే ఉన్నావా? అని కామెంట్లు వచ్చాయి’ అని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఇషాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన యువ ప్లేయర్..వీడియో వైరల్
డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు