డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. ఇంగ్లండ్ కోచ్ మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:36 AM
డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్‌లను తీసుకొచ్చాడంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా చేతిలో 4-1 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అతడికి సంబంధించి మరో అంశం వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్ లోకి మద్యం, బీర్, సిగరెట్లను తీసుకొచ్చాడంటూ అతడిపై సంచలన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యాషెస్ సిరీస్‌ను కోల్పోవడంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సమీక్ష సమావేశం నిర్వహించింది. అతడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు ఈ సమీక్షలో వెల్లడైంది. మైదానం బయటి వివాదాలు మెక్‌కలమ్‌పై ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి.
యాషెస్ సిరీస్ మధ్యలో తొమ్మిది రోజులు విశ్రాంతి రాగా.. పలువురు ఆటగాళ్లు ఆరు రోజులు మద్యం తాగుతూ బయటే గడిపినట్లు సమాచారం. అలానే న్యూజిలాండ్‌లో కూడా అర్ధరాత్రి నైట్‌క్లబ్ బౌన్సర్‌తో హ్యారీ బ్రూక్ వాగ్వాదానికి దిగడం దుమారం రేపింది. కీలక సిరీస్ జరుగుతున్న సమయంలో కొందరు ఆటగాళ్లు క్యాసినోకు వెళ్లారని.. యాషెస్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు ఇదీ ఓ కారణమని ఈసీబీ నివేదిక పేర్కొంది.
ఈ వ్యవహారాలన్నీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, మెక్‌కలమ్ మధ్య విభేదాలకు దారీ తీశాయి. బెన్ స్టోక్స్ కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని సమాచారం. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్‌తో మెక్‌కలమ్‌కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే ప్రధాన కోచ్‌గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం. మెక్‌కలమ్ తన 'బాజ్‌బాల్' వ్యూహంతో ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ రూపురేఖలు మార్చినప్పటికీ, తాజా ఆరోపణలు అతని ప్రతిష్టను మసకబార్చేలా ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్
ఇష్టమొచ్చినప్పుడు వస్తారు.. కోట్లు పట్టుకెళ్తారు