ఐపీఎల్ 2026: విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్
ABN , Publish Date - Mar 22 , 2026 | 10:49 AM
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి సమయం దగ్గర పడుతోంది. మరో ఆరు రోజుల్లో ఈ లీగ్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈక్రమంలో అన్ని జట్లు తమ హోం గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లను మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ సీజన్ ఆరంభానికి ముందే హైదరాబాద్ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అన్ని జట్లను భయపెడుతున్నారు.
శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఏ, బి జట్లగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత ఎస్ఆర్‌హెచ్-ఎ జట్టు తరపున అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్‌తో పాటు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్‌హెచ్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు, నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీశారు.
అనంతరం ఎస్ఆర్‌హెచ్- బి తరపున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శర్మ(4) నిరాశపరిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. మొత్తంగా ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఉప్పల్ స్టేడియంలో ఉతికారేశారు. వీరి సూపర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఇష్టమొచ్చినప్పుడు వస్తారు.. కోట్లు పట్టుకెళ్తారు