ఇష్టమొచ్చినప్పుడు వస్తారు.. కోట్లు పట్టుకెళ్తారు
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:09 AM
ఐపీఎల్‌ను విదేశీ క్రికెటర్లు తేలికగా తీసుకోవడాన్ని మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆక్షేపించాడు. ఐపీఎల్ వేలం విషయంలో తమ వ్యూహాలను మార్చుకోవాలని...
విదేశీ క్రికెటర్లపై చోప్రా ధ్వజం
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను విదేశీ క్రికెటర్లు తేలికగా తీసుకోవడాన్ని మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆక్షేపించాడు. ఐపీఎల్ వేలం విషయంలో తమ వ్యూహాలను మార్చుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించాడు. న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్‌ను అతడి బేస్ ధర రూ.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. అయితే ఈసారి లీగ్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండడంలేదని ఫెర్గూసన్ ప్రకటించాడు. దీనిపైౖ తీవ్రంగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘ఏడు మ్యాచ్‌ల తర్వాత లీగ్ బరిలో దిగుతున్నావు. రూ.కోటి తీసుకొని వెళ్తావు. కానీ అప్పటికే టోర్నీలో జట్టు అవకాశాలు దెబ్బతిని ఉంటాయి’ అని మండిపడ్డాడు. అలాగే పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజెల్‌వుడ్‌లను పనిభారం పేరిట ఐపీఎల్ కొన్ని పోటీలకు దూరంగా ఉంచడంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నూ ఆకాశ్ తప్పుబట్టాడు. ‘యాషెస్ సిరీస్ తర్వాత స్టార్క్ చాలాకాలం బరిలో దిగలేదు. అంటే అతడికి తగిన విశ్రాంతి లభించింది. కానీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకోసం విశ్రాంతి పేరిట స్టార్క్‌ను సీఏ దూరంగా ఉంచడమేమిటి. ఐపీఎల్‌ను పణంగా పెట్టి సీఏ పనిభారాన్ని నిర్వహిస్తోంది’ అని చోప్రా దుయ్యబట్టాడు. విదేశీ క్రికెటర్లు లీగ్ నుంచి తప్పుకోవడమో, ఆలస్యంగా రావడమో చేస్తుండడంతో ఐపీఎల్ ప్రతిష్ఠ, జట్ల సమతూకం కూడా దెబ్బతింటోందని అభిప్రాయపడ్డాడు.. అందువల్ల వేలం వ్యూహాలను పునరాలోచించుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యలకు చోప్రా హితవు పలికాడు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..