Share News

రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..

ABN , Publish Date - Mar 21 , 2026 | 07:09 PM

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దేవాలయాలను సందర్శిస్తోంది. తాజాగా ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రిషబ్ పంత్ రామ్ జన్మభూమిని సందర్శించారు.

రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..
Rishabh Pant Ayodhya visit

స్పోర్ట్స్ డెస్క్: మరో వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్2026 ప్రారంభం కానుంది. ఈనెల 28న బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్‌తో ఈ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా, జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించారు. వీరు బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.


ఎల్ఎస్జీ యజమాని గోయెంకా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామునికి ఎన్ని ప్రార్థనలు చేసినా సరిపోవని అన్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతున్నందున, తమ జట్టు ఆటగాళ్లందరూ ఇక్కడి ఆలయంలో ప్రార్థనలు చేశారని, శ్రీరాముడి ఆశీస్సులతో అంతా సవ్యంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు జట్టు చేపట్టిన ప్రీ-సీజన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సందర్శన జరిగింది. ఈ సమయంలో గోయెంకా, పంత్‌తో పాటు పలువురు లక్నో యాజమాన్య సభ్యులు కూడా ఉన్నారు. 'డాక్టర్ సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్, జట్టులోని ఇతర సభ్యులతో కలిసి ఆశీస్సులు స్వీకరించడానికి అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించారు. జై శ్రీ రామ్' అని ఎక్స్ వేదికగా ఎల్ఎస్జీ జట్టు రాసుకొచ్చింది.


ప్రీ-సీజన్ సన్నాహాల గురించి పంత్ మాట్లాడుతూ.. లక్నో జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ చేరికను ప్రశంసించారు. ఐపీఎల్ 2026 సీజన్ లో అతను జట్టును పటిష్ఠం చేస్తాడని ఆయన నొక్కి చెప్పారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్న 2026 ఐపీఎల్ ఎడిషన్ మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం లక్నో జట్టు ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, ఏప్రిల్ 12న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

కేకేఆర్ నుంచి మొన్న హర్షిత్.. ఇప్పుడు ఆకాశ్‌ దీప్‌ ఔట్!

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్

Updated Date - Mar 21 , 2026 | 08:03 PM