అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:06 PM
రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లకు స్టార్ ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరం కానున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీ టైటిల్ విజయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ కీలక పాత్ర పోషించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టుకు, ఈ సీజన్ ఆరంభానికి ముందే ఒక ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌ల్లో స్టార్ ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) జట్టుకు దూరం కానున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీ టైటిల్ విజయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హేజిల్‌వుడ్‌ను ప్రశంసించారు. అంతేకాక అతడు లేకపోవడం ఆర్సీబీ జట్టుకు పెద్ద దెబ్బ అని అభివర్ణించారు. ఈ ఆసీస్ పేసర్‌కు ఏ ఆటగాడూ సరైన ప్రత్యామ్నాయం కాలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... 'హేజిల్‌వుడ్ రెండు వారాల పాటు అందుబాటులో లేకుంటే.. అప్పటికే మూడు, నాలుగు మ్యాచ్‌లు పూర్తై ఉంటాయి. అతను లేకుండా ఆర్సీబీ సామర్థ్య స్థాయిలు తగ్గిపోతాయి. బెంగళూరు జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది. ఒకవేళ అతని స్థానంలో ఎవరైనా వచ్చినా.. ఆ స్థాయికి రాలేరు. జాకబ్ డఫీ ఉన్నప్పటికీ అతడి వల్ల జట్టుకు పెద్ద లాభించేది ఏమి ఉండదు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో అతను దారుణంగా దెబ్బతిన్నాడు. భారత పరిస్థితులలో అతను రాణించగలడో లేదో చూడాలి' అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌ల్లో అన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.
'హేజిల్‌వుడ్ కేవలం గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు, మ్యాచ్ విన్నర్ కూడా. అతను ప్రత్యర్థుల్లో సృష్టించే భయం బుమ్రా మాదిరిగానే ఉంటుంది. హేజిల్‌వుడ్ అద్భుతమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తాడు. దానివల్ల బ్యాటర్ చాలా ఇబ్బంది పడతాడు. గతేడాది హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ద్వయం సమష్టిగా రాణించి, ఆర్సీబీ పేస్ బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేశారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌ల జోడి అద్భుతంగా ఉంది. ఈ జోడి విచ్ఛిన్నమైతే, బెంగళురు జట్టుకు కష్టమవుతుంది' అని శ్రీకాంత్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
రామ్ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..
కేకేఆర్ నుంచి మొన్న హర్షిత్.. ఇప్పుడు ఆకాశ్ దీప్ ఔట్!