Share News

ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కామెంట్స్... కౌంటర్ ఇచ్చిన గావస్కర్

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:31 PM

'ది హండ్రెడ్‌ లీగ్‌'లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్‌ యాజమాన్యం సన్‌ గ్రూప్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని గావస్కర్ స్పష్టం చేశాడు.

ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కామెంట్స్... కౌంటర్ ఇచ్చిన గావస్కర్
Sunil Gavaskar

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్‌ లీగ్‌'లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్‌ యాజమాన్యం సన్‌ గ్రూప్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్ ప్లేయర్లకు మనం డబ్బులు చెల్లిస్తే.. అవి మన సైనికుల, ప్రజల మరణాలకు పరోక్షంగా కారణం అవుతాయని తెలిపాడు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో జన్మించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అజీమ్ రఫిక్.. భారత్ - పాక్‌ మ్యాచ్‌లకూ కామెంటేటర్‌గా ఎందుకు వ్యవహరించారని గావస్కర్‌ను విమర్శించాడు. తనపై చేసిన విమర్శలకు సన్నీ సమాధానం ఇస్తూనే.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాడు.


ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో గావస్కర్ మాట్లాడుతూ.. 'నేను ఐసీసీ, ఏసీసీ కామెంట్రీ ప్యానెల్స్‌లో సభ్యుడిని. వీటి ద్వారా వచ్చే ఆదాయం అన్ని దేశాలకూ వెళ్తుంది. అలాంటప్పుడు నన్ను మీరు ఎలా ప్రశ్నించగలరు?. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో పాక్‌ క్రికెట్‌ షో ‘ది డ్రెస్సింగ్‌ రూమ్‌’లో వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌తో కనిపించడంపైనా విమర్శలు చేస్తున్నారు. ఆ షోలో పాల్గొన్నందుకు నేనేమీ ఒక్క రూపాయి తీసుకోలేదు. వారికి చెల్లించలేదు. ఇలాంటప్పుడు పాక్‌కు నేను ప్రత్యక్షంగా ఏమీ ఇవ్వలేదు కదా' అని గావస్కర్ ప్రశ్నించాడు.


'నేను సీపీఎల్, ఐఎల్‌టీ20, ఎస్‌ఏ20 లీగ్‌లను అనుసరించడం లేదు. ఆ లీగ్స్‌లో ఎవరు ఆడుతున్నారో కూడా నాకు తెలియదు. ఒకవేళ అందులోనూ భారత ఫ్రాంచైజీలో పాక్‌ క్రికెటర్లు ఆడుతుంటే.. ఇప్పటికైనా వారిని నిలిపేయాలి. పాకిస్థాన్‌ ఆటగాళ్లకు భారత ఫ్రాంచైజీలు డబ్బులు చెల్లించడం ఆపాలని నేను కోరుతున్నాను’ అని సునీల్ గావస్కర్ తెలిపాడు.


ఐసీసీ టోర్నమెంట్లలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు జై షాకు సంబంధం ఉందన్న విమర్శలను కూడా ఆయన ఖండించారు. 'జైషా ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడు. అతడు రాకముందు కూడా దశాబ్దాలుగా భారత్ - పాక్‌ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకే గ్రూప్‌లో ఇరు జట్లు ఉండటానికి జై షానే కారణం అనే వ్యాఖ్యలు అర్థరహితం. షెడ్యూల్‌ను రూపొందించేది ఐసీసీనే కానీ జైషా కాదు. ఐసీసీలోని సభ్యులంతా కలిసి షెడ్యూల్‌ను రూపొందిస్తారు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆదాయాన్ని పంపిణీ చేసిది కూడా ఐసీసీ, ఏసీసీనే’ అని గావస్కర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ఇషాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన యువ ప్లేయర్..వీడియో వైరల్

డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు

Updated Date - Mar 22 , 2026 | 01:38 PM