ఇషాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన యువ ప్లేయర్..వీడియో వైరల్
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:36 PM
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్‌ను యువ ప్లేయర్ జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ ‘నీవు ఔట్.. వెళ్లిపో’ అంటూ సీరియస్‌గా ప్రవర్తించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సిద్దమవుతోంది. గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఎస్ఆర్‌హెచ్ ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్‌పై యువ ప్లేయర్ జీషన్ అన్సారీ సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
శనివారం ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కిషన్ తొలి నాలుగు బంతులను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. అయితే ఆ తర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుతమైన ఫుల్ డెలివరీతో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌పై అన్సారీ సీరియస్ అయినట్లు వీడియోలో కనిపిస్తోంది. తన బౌలింగ్‌లో హిట్టింగ్ చేసి ఔటైన ఇషాన్‌ను జీషన్ ‘ ఇక ఆడింది చాలు.. వెళ్లిపో’ అన్నట్లుగా కాస్త కోపంగా ప్రవర్తించాడు. జీషన్ రియాక్షన్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇషాన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా నవ్వుతూ పెవిలియన్ బాట పట్టాడు.
సాధారణంగా అసలు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ ఔటైనప్పుడు ఇలా చేయడం మనం చూస్తుంటాము. కానీ, ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఇలా వ్యవహరించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీంతో జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావారణం లేదా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇవి కూడా చదవండి:
డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. ఇంగ్లండ్ కోచ్ మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు
ఐపీఎల్ 2026: విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్