ఆర్సీబీ మాజీ ప్లేయర్ విధ్వంసం.. 69 బంతుల్లో 195 పరుగులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:32 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో అజేయంగా 195 పరుగులు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో అజేయంగా 195 పరుగులు చేశాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్‌పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. బౌలింగ్ చేసేందుకు కూడా టైటాన్స్ భయపడేలా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు స్విస్తిక్ చికారా. అతడి 195 పరుగుల్లో సిక్సర్లతోనే 126 పరుగులు వచ్చాయంటే.. అతడు ఏ స్థాయిలో టైటాన్స్ బౌలర్లను ఉతికారేశాడో అర్ధం చేసుకోవచ్చు. 69 బంతుల్లో 21 సిక్సర్లు, 11 బౌండరీలతో 195* పరుగులు సాధించాడు. చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. సిక్స్, సిక్స్, ఫోర్, డాట్ బాల్, ఆపై మరో భారీ సిక్సర్‌తో ఆ ఉత్కంఠభరితమైన ఇన్నింగ్స్‌ను చికారా ముగించాడు.
అనంతరం 308 పరుగుల టార్గెట్‌తో బ్యాంటింగ్ కు దిగిన టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వస్తిక్ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్‌లోనే అత్యధికంగా 499 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్‌లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేయగా, ఆ వేలంలో అమ్ముడుపోలేదు.
ఇవి కూడా చదవండి:
నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..
ఐపీఎల్ 2026: కుమార్తెతో కలిసి రోహిత్ శర్మ క్రేజీ డ్యాన్స్.. వైరల్ వీడియో